Indraja | నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ఇంద్రజ కీలక పాత్రలో కనిపించారు. హీరో తల్లి పాత్రలో ఆమె నటనకు మంచి స్పందన లభించింది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయవంతమైందని చిత్రబృందం తాజాగా కృతజ్ఞత సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో లగడపాటి శ్రీధర్.. ఇంద్రజ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలిచాయి.‘అనకాపల్లి’ సినిమాలో నటించిన వారందరిలో ముందుగా ఇంద్రజను అభినందించాలని లగడపాటి శ్రీధర్ అన్నారు. ఒకప్పుడు కథానాయికగా స్టార్ హీరోయిన్గా వెలుగొందిన ఇంద్రజ.. ప్రస్తుతం ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా త్రినాథరావు పక్కన భార్య పాత్రలో నటించడానికి అంగీకరించడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఈ సినిమాకు ఇంద్రజే అతిపెద్ద స్టార్ అని, సినిమా విజయానికి ఆమె నటన కూడా ముఖ్యమైన కారణమని పేర్కొన్నారు.
తెలుగు చిత్రసీమలో తనకు ఎంతో ఇష్టమైన నటీమణుల్లో జయసుధ తర్వాత ఇంద్రజ ఉన్నారని లగడపాటి శ్రీధర్ తెలిపారు. ‘యమలీల’ సినిమా నుంచి ఇంద్రజ డ్యాన్స్, ఎనర్జీ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ప్రస్తుతం టెలివిజన్ కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతగా ఆమె వ్యవహరిస్తున్న తీరు, హుందాతనం, నిజాయతీ తనకు జయసుధను గుర్తు చేస్తాయని అన్నారు. ఇంద్రజ ఇప్పుడు తల్లి పాత్రలకు కూడా ఎంతో చక్కగా సరిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే తాను కేవలం పాత్ర గురించి మాత్రమే కాకుండా, ఇంద్రజ వ్యక్తిత్వం గురించి కూడా ఎంతో గొప్పగా భావిస్తున్నానని చెప్పారు.
ఇంద్రజ వ్యక్తిత్వానికి సంబంధించిన ఒక సంఘటనను లగడపాటి శ్రీధర్ గుర్తు చేసుకున్నారు. చెన్నై విమానాశ్రయంలోని లాంజ్‌లో తన తండ్రిని ఇంద్రజ ఎంతో ప్రేమగా, చిన్నపిల్లాడిలా చూసుకోవడం తాను స్వయంగా గమనించానని చెప్పారు. ఆ ఘటన తనను ఎంతగానో కదిలించిందని, ఆ విషయం చెబుతున్న సమయంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం చాలామంది వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవడం భారంగా భావిస్తున్నారని, వారిని కేర్టేకర్లకు అప్పగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇంద్రజ మాత్రం షూటింగ్‌లకు వెళ్లాల్సి వచ్చినా తన తండ్రిని వెంట తీసుకెళ్లి ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని తెలిపారు. కూతురు అంటే ఇలా ఉండాలి’ అని ఆ సమయంలో తాను అనుకున్నానని లగడపాటి శ్రీధర్ చెప్పారు. ఇంద్రజ కేవలం మంచి నటి మాత్రమే కాదని, గొప్ప మనసున్న వ్యక్తి అని కొనియాడారు. చిన్నతనంలో తల్లిదండ్రులు మనల్ని ఎంత ప్రేమగా చూసుకున్నారో.. వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మనం కూడా అదే ప్రేమతో, బాధ్యతతో చూసుకోవాలని ఇంద్రజ జీవితం చెబుతోందని అన్నారు.