Nepal | నేపాల్లో సంభవించిన భారీ వరదల( Massive floods)తర్వాత గల్లంతైన 5,285 మంది మరణాలను అధికారికంగా నమోదు చేసే ప్రక్రియను సులభతరం చేయడానికి నేపాల్ రెండు చట్టాలను సవరించడానికి సిద్ధమవుతోంది. దీనివల్ల వారి కుటుంబాలు సహాయం, పరిహారం, ఇతర చట్టపరమైన ప్రయోజనాలను పొందే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. నేపాల్ ప్రభుత్వ నివేదికల (NDRRMA) ప్రకారం, ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో హిమపాతం కారణంగా భోటెకోశి, త్రిశూలి నదుల్లో సంభవించిన ఈ వినాశకరమైన వరదల్లో ఇప్పటివరకు 1,455 మంది మరణించగా, 5,285 మంది ఆచూకీ లేకుండా పోయారు. వరదలు వచ్చినప్పటి నుంచి దాదాపు 40 రోజుల తర్వాత సహాయక చర్యలకు ప్రభుత్వం ముగింపు పలికింది. బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు సమాయత్తమవుతున్నది.
విపత్తులో గల్లంతైన వారి మరణాలను ప్రకటించడానికి, నమోదు చేయడానికి ప్రస్తుత చట్టపరమైన నిబంధనలు సరిపోవని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుభాష్ కుమార్ భట్టరాయ్ అన్నారు. చట్ట సవరణతో బాధితులను సులువుగా ఆదుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇందుకు గాను ఫాస్ట్-ట్రాక్” ప్రక్రియ ద్వారా ముందుకు తీసుకువెళ్తామని అధికారులు తెలిపారు. అలాగే గాలింపు చర్యలు అధికారికంగా పూర్తయినప్పటికీ, రీబిల్డింగ్ పనుల్లో ఎక్కడైనా ఆనవాళ్లు లేదా మృతదేహాలు కనిపిస్తే రికవరీ ప్రక్రియ కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు.