Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి తన ‘నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize)’ ఆకాంక్షను బయటపెట్టుకున్నారు. తానేమీ గొప్పలు చెప్పుకోవడం లేదని, ఎనిమిది యుద్ధాలు ఆపానని మరోసారి పాత పాట అందుకున్నారు. ఒకవైపు ఇరాన్ (Iran) తో యుద్ధం చేస్తూనే ఎనిమిది యుద్ధాలు ఆపానంటూ నోబెల్ శాంతి బహుమతి ప్రకటన వేళ హడావుడి షురూ చేశారు.
ఇప్పటివరకు ఏ అమెరికా అధ్యక్షుడు చేయలేని పనులు తాను చేశానని, తాను గొప్పలు చెప్పడం లేదని, వాస్తవాలే మాట్లాడుతున్నానని ట్రంప్ అన్నారు. గతంలో ఏ అధ్యక్షుడు కూడా ఇన్ని యుద్ధాలకు పరిష్కారం చూపించి ఉండకపోవచ్చని చెప్పారు. తాను ఇప్పటికే 8 యుద్ధాలు ఆపానని, నోబెల్ శాంతి బహుమతి పొందేందుకు తాను అన్నివిధాల అర్హుడినని అన్నారు. కానీ నోబెల్ నాకు వస్తుందనే నమ్మకం మాత్రం తక్కువేనని చెప్పారు.
నోబెల్ కమిటీని ఉద్దేశిస్తూ.. వారి నిర్ణయం ఏమిటో తనకు తెలియదని, నాలాంటి వారికి నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వకపోవడమే వారికి అలవాటుగా ఉన్నట్లు కనిపిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా ఏటా నార్వేజియన్ నోబెల్ కమిటీ నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేస్తుంది. 2026 ఏడాదికిగానూ ఈ పురస్కారాన్ని అక్టోబర్ 9న ప్రకటించనున్నారు. ఇదిలావుంటే గత ఏడాది కూడా నోబెల్పై ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
కానీ వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు నోబెల్ పీస్ ప్రైజ్ దక్కింది. దాంతో ట్రంప్ నిరాశకు గురయ్యారు. ఈ ఏడాది నామినేషన్లలో ట్రంప్ పేరు ఉండవచ్చునని గతంలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.