– ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి
చండూరు, జూన్ 23 : కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం చండూరులో జరిగిన ఏఐటీయూసీ మండల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాలక వర్గాలు కార్పొరేట్ శక్తులకు తొత్తుగా మారాయని అనేక దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న హక్కులు ఇప్పుడు కనుమరుగైకేంద్ర ప్రభుత్వ కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయని ఆయన ఆరోపించారు.ఎన్డీఏ పాలనలో కార్మిక హక్కులు హరించబడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల సవరణ పేరుతో యాజమాన్యాల క్రింద కార్మికులు బానిసలుగా పనిచేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ప్రధాని మోదీకి కార్పొరేట్ల రక్షణ తప్ప కార్మిక సంక్షేమం తెలియదని ఆయన తెలిపారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికులు తమ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ప్రపంచీకరణ, మతోన్మాదం, కార్మిక చట్టాల సవరణ ఇప్పుడు -అత్యంత వేగంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని దీనిని ప్రతిఘటించేందుకు సమరశీల పోరాటాలు చేయాలన్నారు. 44 కార్మిక చట్టాలను సవరణ చేసి నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకు రావడం కార్మికులకు శాపంగా మారాయని అన్నారు. పాలకులు కార్మికులను కాదని యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నాయని శ్రమకు తగిన వేతనం ఇప్పించడంలో విఫలమవుతున్నాయన్నారు. హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్ లో ఉన్న డబ్బులు వెంటనే విడుదల చేయాలని కోరారూ.కార్మికుల సంక్షేమాన్ని చూడాల్సిన పాలకులు యాజమాన్యాల సంక్షేమాన్ని చూస్తున్నారని యాజమాన్యాలకు వేల కోట్ల రాయితీలు ప్రకటిస్తు ప్రభుత్వాలు కార్మికుల గురించి ఆలోచించడం లేదన్నారు. పాలకులు ఆవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధాం కావాలని పిలుపునిచ్చారు.
నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుంతుంటే అదుపు చేయడంలో పాలకులు విఫలమయ్యారని, ధరలు పెరగడం వల్ల కార్మికులు మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. జులై 19వ తేదీన నల్లగొండ జిల్లా ఏఐటీయూసీ మహాసభ గుర్రంపొడ్ లో జరుగుతుందని అన్నారు. ఈ సమావేశానికి ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు దోటి వెంకన్న అధ్యక్షత వహించగా మండల కార్యదర్శి జెల్ల శ్రీనివాస్, ఆలేటి జగన్, కావాలి శ్రీను, చందా మధుకర్, పేర్ల గురుస్వామి, భిక్షం, లింగస్వామి పాల్గొన్నారు.