సినిమా మీద పాషన్‌తో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి అభిరుచి గల నిర్మాతల్లో కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె.నారాయణ ఒకరు. దళపతి విజయ్‌తో ‘జననాయగన్’, చిరంజీవితో ‘మెగా 158’, యశ్‌తో ‘టాక్సిక్’.. నిర్మాతగా ప్రస్తుతం ఆయన లైనప్ ఇది. దక్షిణాది సినీ నిర్మాణరంగంలో ఉవ్వెత్తున ఎగసిన కెరటంగా వెంకట్ కె.నారాయణను అభివర్ణించవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ కథానాయకుడిగా హెచ్.వినోద్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘జననాయగన్’ చిత్రం ఒడిదుడుకులన్నింటినీ అధిగమించి ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో వెంకట్ కె.నారాయణ ప్రత్యేకంగా మాట్లాడారు.
కోవిడ్ వల్ల సినిమా పరిశ్రమ కూడా చాలా నష్టపోయింది. ఎన్నో సినిమాలు ఆగిపోయాయి. ఎంతమందో ఉపాధిని కోల్పోయారు. అప్పుడే పరిశ్రమకు ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. ఫిల్మ్ ఫైనాన్స్‌తో ప్రారంభించి డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలుపెట్టాం. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను కర్నాటకలో డిస్ట్రిబ్యూట్ చేసింది మేమే. ఆ తర్వాత ప్రొడక్షన్ మొదలుపెట్టాం.
‘జగనాయగన్’ తమిళంలో మా తొలి సినిమా. సింగిల్ సిట్టింగ్‌తో ఈ కథను ఓకే చేశారు విజయ్. ‘భగవంత్ కేసరి’ సినిమా విజయ్‌కి బాగా నచ్చింది. అందులో అమ్మాయిని ఆర్మీలో చేర్పించాలనే థ్రెడ్‌తో పాటు ముఖ్యమైన రెండు సన్నివేశాలను ప్రేరణగా తీసుకొని ఈ కథను దర్శకుడు హెచ్.విజయ్ తయారు చేశారు. ఈ విషయంపై అనిల్ రావిపూడితో కూడా మాట్లాడాం. ఏ విషయాన్నీ మేం దాచలేదు. ట్రైలర్‌ని కూడా నిజాయితీగా కట్ చేశాం. కానీ సినిమా పరంగా చూస్తే ఇది పూర్తిగా కొత్త ప్రపంచం.. కొత్త సమస్య. ఓపెన్ మైండ్‌తో చూస్తే కొత్త అనుభూతి పొందుతారు.
గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ , సమాజంలో మార్పు తీసుకురావాలనే సందేశంతో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ సినిమా జాతీయ అవార్డు కూడా అందుకుంది. అదే స్ఫూర్తితో వస్తున్న ఈ సినిమాకు మొదట యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చి, తర్వాత ఏ సర్టిఫికెట్ ఇవ్వడం కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఇది యువత, పిల్లలు చూడాల్సిన సినిమా. ఇక విడుదల ఆలస్యం వల్ల ఒక నిర్మాతగా ఎన్ని సమస్యలు ఫేస్ చేయాలో అన్నీ ఫేస్ చేశా. గమ్యం గొప్పదైనప్పుడు ప్రయాణం కఠినంగానే ఉంటుంది. విజయాలెప్పుడు సులభంగా రావు. దేవుడు యుద్ధం తర్వాతే కిరీటం ఇస్తాడు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న విజయ్ సినిమా ఇది. అందుకే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొని ఉంది. ఈ తరం ప్రేక్షకులకు ఓ ముఖ్యమంత్రి నటించిన సినిమా థియేటర్లలో చూసే అవకాశం రావడం అరుదు. ఇది కచ్చితంగా మెమరబుల్ మూమెంట్. విజయ్ క్రమశిక్షణ గల వ్యక్తి. ‘నేను పాలిటిక్స్‌లోకి వెళ్తున్నాను. ఇది నా చివరి సినిమా. విడుదల విషయంలో ఇబ్బందులు రావొచ్చు’ అని ముందే చెప్పారాయన. రిలీజ్ టైమ్‌లో ఇబ్బందులు రావొచ్చని మాత్రమే భావించాం. కానీ రిలీజ్‌తో పాటు పైరసీ, కోర్టు వ్యవహారాలు, సెన్సార్.. ఇలా చాలా సమస్యలు ఎదురయ్యాయి. జనవరిలో విడుదల కావాల్సిన సినిమా జూలై 23న వస్తున్నది. ఈ విషయంలో విజయ్ మాకు అండగా నిలిచారు. ఆయనతో పనిచేయడం నిజంగా గొప్ప అనుభవం.
విజయ్ సినీ ప్రయాణానికి ఓ బహుమతిగా.. 30దేశాల్లో 8వేల స్క్రీన్స్‌లో సినిమాను విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం ప్రజాసేవలో ఉన్న విజయ్ మళ్లీ సినిమాలు చేసే అవకాశం ఉంటుందని మేం అనుకోవడంలేదు. ఒకవేళ అలాంటి అవకాశమే వస్తే మాత్రం వదులుకోం.
నేను చిరంజీవి అభిమానిని. ఆయన సినిమాలు నాకెంతో ప్రేరణనిచ్చాయి. అందుకే తెలుగులో సినిమా చేస్తే ముందు చిరంజీవితోనే చేయాలని నిశ్చయించుకున్నా. అందులో భాగంగానే మెగాస్టార్‌తో బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నా. అది చిరంజీవి కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది.