కుభీర్ : అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టినట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. ఆరుగాలం రెక్కలను ముక్కలు చేసుకుని కష్టించి పండించిన పంటకు మద్దతు ధర లభించక, పెట్టిన పెట్టుబడులు రాక తీవ్రంగా నష్ట పోతున్న రైతన్నలకు భరోసా లేకుండా పోయింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో అతివృష్టి కారణంగా ప్రధాన పంటలైన సోయా, పత్తి దెబ్బతిని సగానికి సగం దిగుబడులు తగ్గిపోయాయి. వచ్చిన పంట ఉత్పత్తులను ప్రభుత్వం కోర్రీలు పెట్టి 25% సోయాబీన్ కూడా కొనుగోలు చేయలేదు. దాంతో రైతులు దళారులకు, ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకు పంటను అమ్ముకున్నారు. పీకల్లోతూ కష్టాల్లో మునిగిపోయారు.
ఫలితంగా యాసంగిలోనైనా పత్తి, సోయాకు బదులుగా మొక్కజొన్న సాగుచేసి కొంతలో కొంతైనా నష్టాన్ని పూడ్చుకొందామని మండలంలోని రైతులు భావించారు. అనుకున్నట్లుగానే గత ఏడాది యాసంగి కంటే ఈ ఏడు యాసంగిలో మొక్కజొన్నను దాదాపు రెట్టింపు సాగుచేశారు. నిరుడు 9 వేల పైచిలుకు ఎకరాల్లో మొక్కజొన్న సాగవగా.. ఈ ఏడు 13 వేల ఎకరాల్లో సాగు జరిగింది. జనవరి చివరి వారం నుండి మొక్క జొన్న కోతకు రానుంది. ఈ తరుణంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మొక్కజొన్నకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడంతో గిట్టుబాటు అవుతుందా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం పంటలు సాగుచేసిన రైతాంగాన్ని ఆగం పట్టిస్తోంది. సోయా పంటను కొంటామని చెప్పి రంగు మారిందని, తేమ ఉందని, జల్లెడ పేరిట సవాలక్ష ఆంక్షలు విధించి కేవలం 40, 50 శాతం మాత్రమే కొనుగోలు చేసి రైతులను నష్టాల్లోకి నెట్టారు. మొక్కకొన్న చేతికొచ్చిన తర్వాత అదే పరిస్థితి పునరావృతం అవుతుందేమోనన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. మొక్కజొన్నకు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ రూ. 2400 ప్రకటించినప్పటికీ.. పంట చేతికొచ్చేలోపు కొనుగోలు కేంద్రాలను తెరిచి సకాలంలో కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
గత ఏడాది మార్చిలో ప్రైవేటులో క్వింటా మక్కలకు రూ.18,00 నుంచి 2,100 చెల్లించారు. ఈ సారి మద్దతు ధర కంటే ఎక్కువగా క్వింటా మక్కలకు కనీసం రూ.2600 లభిస్తే కొంతలో కొంతైనా నష్టాలను పూడ్చుకోవచ్చంటున్నారు రైతులు. ప్రభుత్వం నెలరోజుల ముందే మండలంలో కనీసం 4 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేయాలని మండల రైతాంగం కోరుకుంటోంది.
పెట్టుబడి సాయానికి ఎగనామం పెట్టిన రేవంత్ సర్కారు కనీసం రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. సోయాలకు కోర్రీలు పెట్టి సగం మంది రైతుల సోయా పంటను కూడా కొనలేదు. మళ్ళీ ఇప్పుడు మక్కలకు అలా చేయకుండా ప్రతి గింజను కొనుగోలు చేయాలి. రైతంగాన్ని ఆదుకోవాలి.