తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట బీఆర్ఎస్ ఓట్ల తొలగించే ప్రమాదముందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఎల్వోలు, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముషీరాబాద్‌లోని శనివారం నిర్వహించిన నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
– సిటీబ్యూరో
సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): శనివారం ముషీరాబాద్‌లో కోలేటి దామోదర్ గుప్త ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సర్ పట్ల ప్రతి ఒక బీఆర్ఎస్ కార్యకర్త జాగ్రత్తగా ఉండాలని.. అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేసే ఓటర్ల నమోదుకు సంబంధించిన అవకతవకలపైనా జాగ్రత్త వహించాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పైన కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించేలా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అదే విధంగా పార్టీ తరఫున ఎంపిక చేసిన బూత్ లెవెల్ అసిస్టెంట్లతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.
పార్టీ తరఫున ఎంపిక చేసిన బీఎల్ఏలు ఒక్క కూడా తొలగకుండా కాపాడేలా ప్రయత్నం చేయాలన్నారు. అదేవిధంగా అధికార కాంగ్రెస్, బీజేపీ అడ్డగోలుగా డబుల్ ఓట్లను, దొంగ ఓట్లను నమోదు చేసుకునే ప్రమాదం ఉన్నదని, వీటిని అరికట్టేలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ ఏవిధమైన కుట్రలకైనా పాల్పడే ఆస్కారం ఉందని, బీఆర్ఎస్ నేతల నుంచి సామాన్య కార్యకర్త దాకా అప్రమత్తంగా ఉండాలన్నారు. వచ్చే నెల నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని వెల్లడించారు. పూర్తి స్థాయిలో డిజిటల్ రూపంలో జరిగే ఈ సభ్యత్వ నమోదుకు సంబంధించి పార్టీ శ్రేణులకు బూత్ వారీగా శిక్షణ కార్యక్రమాలు ఇస్తామని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలు, అన్యాయాలపైనా పార్టీ శ్రేణులకు శిక్షణ ఇచ్చి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు.

తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి యువతకు యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై రాహుల్ గాంధీని నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ముషీరాబాద్ నియోజకవర్గానికి రాహుల్ గాంధీ వచ్చి అడ్డగోలు హామీలిచ్చి, వారందరినీ మోసం చేశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ వచ్చి డిక్లరేషన్ల పేరుతో ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని విద్యావంతులైన యువకులతో కూడా ఓట్లు వేయించుకొని.. ఇప్పటిదాకా కనీసం మొహం కూడా చూపించడం లేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తే తిరిగి వచ్చి అండగా నిలబడతానని మాయమాటలు చెప్పిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు ఎక్కడున్నారని మండిపడ్డారు.
తెలంగాణ యువత, నిరుద్యోగులను నట్టేటా ముంచారని కేటీఆర్ అన్నారు. కేవలం ఎన్నికల ప్రచారం అప్పుడు విద్యార్థులు, నిరుద్యోగుల ఓట్లు దండుకొని ఇప్పుడు మొహం చాటేశారన్నారు. తెలంగాణ యువత రాహుల్ గాంధీని ఈ అంశంలో నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిందే లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను భర్తీ చేసి చేతులు దులుపుకొన్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ యువతకు చేసిన ద్రోహాన్ని కచ్చితంగా ప్రశ్నించాలన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారత రాష్ట్ర సమితి ఘనవిజయం సాధిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, హైదరాబాద్‌లో అద్భుతమైన విజయం సాధించిందని..నగర ప్రజలు బీఆర్ఎస్ వెంట నిలిచారని కేటీఆర్ గుర్తు చేశారు. 10 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరానికి చేసిన అభివృద్ధి వల్లే ఇది సాధ్యమైందన్నారు. అయితే ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు, బీఆర్ఎస్ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లను తొలగించే ప్రయత్నం అధికార కాంగ్రెస్ చేసే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ నగరానికి రెండున్నర సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేదని విమర్శించారు. నగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్లై ఓవర్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, రోడ్లు వంటి నిర్మాణాలు చేస్తే.. రేవంత్‌రెడ్డి మాత్రం హైడ్రా పేరిట వేల ఇండ్లను కూల్చే ప్రయత్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో నగరాన్ని ప్రపంచ స్థాయిలో నిర్మిస్తే.. అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.