హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): నమ్మిన సిద్ధాంతం కోసం మొకవోని పట్టుదలతో రాజీలేని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తాను పార్టీని స్థాపించి మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు, నాటి సమైక్య పాలకుల దమననీతిని ఎదిరించి, భుజం తట్టి అండగా నిలిచిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, గాంధేయవాది, కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన కృషిని కేసీఆర్ స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తన జల దృశ్యం నివాసాన్ని తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పార్టీ ఆవిర్భావానికి వేదికగా ఇచ్చిన బాపూజీ, గొప్ప వ్యక్తిత్వం కలిగిన రాజనీతిజ్ఞుడని కేసీఆర్ కొనియాడారు. ఆయన కృషిని గౌరవిస్తూ, వారి త్యాగాలు రేపటి తరాల వారు గుర్తుంచుకునేలా, పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో పలు కార్యక్రమాలు అమలుచేశామని గుర్తుచేశారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించే సంప్రదాయాన్ని ప్రారంభించామని తెలిపారు. ట్యాంక్‌బండ్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, ఆయన పేరుతో హార్టికల్చరల్ యూనివర్సిటీని స్థాపించుకున్నామని గుర్తుచేశారు. బాపూజీ ఆశయాలకు అనుగుణంగా సబ్బండ కుల వృత్తుల సంక్షేమం అభివృద్ధి కోసం అమలుచేసిన పలు కార్యక్రమాలు విజయవంతమై దేశం దృష్టిని ఆకర్షించాయని పేర్కొన్నారు. బహుజనవర్గాల అభ్యున్నతి కోసం నిత్యం పరితపించిన బాపూజీ.. ఆయన ఆశయాలను ఆచరించడం ద్వారానే వారికి ఘనమైన నివాళులు అర్పించిన వారమవుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.