తెలంగాణ బతుకు చిత్రం బతుకమ్మ. తీరొక్క పూలతో కొలువుదీరే బతుకమ్మ సంబురానికి పాటలు ప్రత్యేకం. పౌరాణిక గాథలు, చారిత్రక విశేషాలు, సమకాలీన అంశాలను పాటలుగా కట్టి ఆటలాడుతుంటారు ఆడబిడ్డలు. తెలంగాణ అస్తిత్వమైన బతుకమ్మ పాటలు గ్రామాలు దాటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. పల్లెసీమ కట్టిన పల్లవులు యూట్యూబ్‌లో టాప్ లేపుతున్నాయి. బతుకమ్మ సందర్భంగా ఏటా జానపద కళాకారిణులు ప్రత్యేకంగా పాటలు అల్లి తమ పాటవం ప్రదర్శిస్తుంటారు. ఈ ఏడాదీ మన తల్లి పాటలతో హోరెత్తిస్తున్నారు
కొందరు. ‘తంగేడు పూసింది’ అంటూ అడవి పూల సాక్షిగా ఆడబిడ్డల కష్టసుఖాలు అభివర్ణించిన సారంగదరియా కోమలి, ‘సిరిమల్లె చెట్టు మీద చిలుకలు వాలినయో’ అని పాడిన వొల్లాల వాణి జిందగీతో ముచ్చటించారు..
పాట పేరు: సిరిమల్లె చెట్టు
విడుదల: సెప్టెంబర్ 21
రీచ్: 6 లక్షలకు పైగా
రచయిత: డాక్టర్ వెన్నెల శ్రీనాథ్
గాయిని: వొల్లాల వాణి, హనుమంత్ యాదవ్
కాస్ట్: నాగ దుర్గ
యూట్యూబ్ చానెల్: ఎన్ఎస్ మ్యూజిక్
తెలంగాణ సాధనలో బతుకమ్మను కూడా ఒక భాగం చేసుకున్నాం. రాష్ట్రం వచ్చిన తరువాత ఘనంగా పండుగ చేసుకుంటున్నాం. చిన్నప్పుడు మా అమ్మ బతుకమ్మ పాటలు పాడుతుంటే ఆమెతో పాటు నేను కోరస్ పాడుతూ నేర్చుకున్నా. 2014లో వెన్నెల శ్రీనాథ్ రాసిన ‘పుడమి పొత్తిళ్ల’ పాటతో బతుకమ్మ పాటలు పాడటం మొదలుపెట్టాను. అప్పట్నుంచి ప్రతి ఏడాదీ పాడుతున్నా. అవి యూట్యూబ్‌లో మంచి ఆదరణను పొందుతున్నాయి. ఏటా సరికొత్త థీమ్‌తో, ఈ తరానికి తగ్గట్టుగా పాటలను మలుస్తున్నాం. ఈ సారి పాడిన ‘సిరిమల్లె చెట్టు కింద’ బతుకమ్మ పాటలో తంగేడు పూలకు ప్రధాన్యమిచ్చాం. ‘తల్లీ నీ రూపం తంగేడు పూలు.. తల్లి నీ మురిపెమూ తామరపూలు’ అంటూ గౌరమ్మను కొలుచుకున్నాం. మల్లె చెట్టు మీద ఒక అమ్మాయి చేయి వేసిందనే కోణంలో ‘సిరిమల్లె చెట్టు మీద చిలుకలు వాలినయో’ అన్న బాణిని జోడించాం. రచయిత డాక్టర్ వెన్నెల శ్రీనాథ్ ఈ ఏడాది కూడా సరికొత్త పదాలతో అందమైన పాట రాసి స్వచ్ఛమైన అర్థాన్నిచ్చారు. ఇంతకుముందు పాటలను ఆదరించినట్లే దీన్ని కూడా ప్రజలు స్వాగతించారు. అందుకే రోజుల వ్యవధిలోనే 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘వాణక్క పాడిన పాట పెట్టుర్రి’ అని బతుకమ్మ ఆడే చోట అడిగి మరీ ఈ పాట పెట్టించుకుంటున్నమని ఫోన్లు చేసి మరీ చెబుతుంటే మనసంతా సంబురంగా ఉంది.
మాది కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసీఫ్‌నగర్. పాటలంటే ప్రేమించే నేను మా ఊరి బడిలో ఆరోగతి వరకు మాత్రమే చదువుకున్నా. విప్లవ గీతాలంటే ఇష్టంతో నేను దళంలోకి వెళ్లాను. అక్కడే పెండ్లి చేసుకున్నా. దళం నుంచి బయటికి వచ్చాక డిస్టెన్స్‌లో పదోతరగతి పరీక్షలు రాసి పాసయ్యా. బతుకమ్మ పండుగ అంటే ఎంతో మమకారం. అందరి కన్నా ముందు నేనే బట్టలు కుట్టించుకునేదాన్ని. టైలర్‌కు ఒక రూపాయి ఎక్కువిచ్చి.. మంచిగ కుట్టమనేదాన్ని. పండుగొచ్చిందంటే తంగేడు, గునుగు పూలు తెంపడానికి చేలపొంటి తిరిగెటోళ్లం. ఈ తరం పిల్లలకు అసలు తంగెడు మొక్కలు ఎట్లుంటయో కూడా తెలియదు. ఎంతో ఇష్టపడి పువ్వు తెచ్చుకొని పేర్చుకున్న బతుకమ్మను బజార్ల పెట్టి నాలుగైదు గంటలపాటు ఆడుకునేటోళ్లం. కానీ, ఇప్పటోళ్లు గంటసేపు ఆడేందుకే ఇబ్బంది పడుతున్నరు. పాటలంటే ప్రాణమైన నేను సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటాను.
పాట పేరు: తంగేడు పూసింది
విడుదల: సెప్టెంబర్ 15
వ్యూస్: 5 లక్షలకు పైగా
రచయిత: కోమలి
గాయకులు: కోమలి, లావణ్య
కాస్ట్: మౌనిక డింపుల్, వర్షిణి, జయ
యూట్యూబ్ చానెల్: కోమలి ఆఫీషియల్
నా అసలు పేరు కోమల అయినా సారంగదరియా పాట మంచి హిట్ కొట్టడంతో సారంగదరియా కోమలి అనే పిలుస్తున్నరు. మాది మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ఇంటికన్నే గ్రామం. డిగ్రీ పూర్తి చేసిన నాకు ఏడో తరగతి నుంచే జానపదాలంటే చెప్పలేనంత ఇష్టం. నా చిన్నప్పుడు మా అమ్మ పనిచేసుకుంటూ పాటలు పాడుతుండేది. నేను ఆసక్తిగా వినేదాన్ని. అలా ఆ పాటలన్నీ నాకు కంఠతా వచ్చేశాయి. పదో తరగతిలో ఉన్నప్పుడు టీ న్యూస్ నిర్వహించిన ‘రేలారే’ ఫోక్ దరువులో టైటిల్ సాధించాను. ఆ తరువాత రసమయి బాలకిషనన్న ప్రోత్సాహంతో ‘మార్మోగిన పాట’ కార్యక్రమంలో పాలుపంచుకున్నాను. ఒకవైపు చదువుకుంటూనే జానపద పాటల కార్యక్రమాలు ఎక్కడున్నా వెళ్లిపోయేదాన్ని. డిగ్రీ అయిపోయాక పై చదువులు చదివించలేక ఇంట్లోవాళ్లు పెండ్లి చేశారు.
పెండ్లయిన తర్వాత కొన్ని రోజులు పాటలు పాడటం ఆపేశాను. కానీ, యూట్యూబ్ వేదికగా చాలామంది కళాకారులు వెలుగులోకి రావడం చూసి నాకూ ఉత్సాహం కలిగింది. నా టాలెంట్ నిరూపించుకోవాలి అనిపించింది. ఆ క్రమంలో చిన్నప్పుడు మా అమ్మ నేర్పించిన సారంగదరియా పాట పాడి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాను. దానికి మంచి స్పందన రావడంతో 2021లో నేనే ఒక యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేశాను. ఇక అప్పటినుంచి నేను రాసి పాడిన పాటలన్నీ అందులో అప్లోడ్ చేస్తున్నా. ‘సిక్కులో సిర సాపలోనే’, ‘రమణీయ సిరిమల్లెలో’ పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నేనే రాయడం, పాడటం వల్ల జనాలకు మరింత చేరువయ్యాను.
బతుకమ్మ అంటేనే ఆడపిల్లల పండుగ. ఎన్ని పనులున్నా పండుగ నాటికి ఆడబిడ్డలంతా అత్తగారింటి నుంచి తల్లిగారింటికి చేరుకుంటారు. బతుకమ్మ పండుగకు కలుసుకొని తమ కష్టసుఖాలు పంచుకుంటారు. ఈ నేపథ్యంగా రాసి, పాడిందే ‘తంగేడు పూసింది’ పాట. ఇప్పుడంటే సెల్ఫోన్లు ఉండి ఏ ముచ్చటైనా క్షణాల్లో తెలుసుకుంటున్నాం. అప్పట్లో మనిషి మనిషి కలుసుకొని మాట్లాడుకుంటేనే మనసుకు నిమ్మలం ఉండేది. ఇక పాట విషయానికి వస్తే.. ఒక్క తల్లికి పుట్టిన పిల్లలైనా వాళ్ల రాతలు మాత్రం వేరుగా ఉంటాయి. ఒకామెను సంపన్న కుటుంబానికిచ్చి లగ్గం చేస్తే, మరొక్కరిని పేదింటికిస్తరు. పేదింటికిచ్చిన అక్కకు బంగారు గొలుసొకటి కొని దాసుకొచ్చి మరీ తన అన్న ఇస్తడు. ఇచ్చిన ముచ్చట ‘ఎవరికీ చెప్పకు చెల్లె’ అని ఆమె దగ్గర మాట తీసుకుని పోతడు.
‘అక్కా నీ మెడల దండెక్కడిదే’ అని చెల్లె అడిగినప్పుడు ‘ఎములాడ రాజన్న ఇచ్చిండే ఈ దండ’ అని అన్న పేరు చెప్పకుండా దేవుని పేరు చెబుతుంది అక్క. చెల్లి భర్త మంచోడే కానీ అక్క భర్త మంచోడు కాదు. ‘అమ్మానాన్నలు పెట్టిన కొత్త బట్టలు కట్టుకొని బజార్ల బతుకమ్మ ఆడుకుందామక్క’ అన్న చెల్లి మాటకు.. ‘నా భర్త మంచోడు కాదు చెల్లె’ అని సూటిగా చెప్పకుండా ‘పట్టు చీర కట్టుకొని పట్టంచు రైక తొడిగి ఆడనియ్యడక్కో వాడు కొంటె మొకపోడే.. వాడు కోతి మొకపోడే’ అంటూ పాట రూపంలోనే తన బాధను వెలిబుచ్చుతుంది. ఇలా అక్కాచెల్లెళ్ల సంభాషణతో పాటంతా సాగుతుంది.
చిన్నప్పుడు బొడ్డెమ్మ ఆడుకున్నప్పుడు ‘తంగేడు పూసింది’ పాటనే పాడుకునేదాన్ని. ఆ పాటను ఈ జనరేషన్‌కు మళ్లీ వినిపిస్తే బాగుంటదని రాసి, పాడిన. నాకు ఎంతో ఇష్టమైన పాట కావడంతో కేవలం గంటలోనే మార్పుచేర్పులతో రాశాను. మరో గంటలోనే పాడేశాను. నాతో పాటు లావణ్య కూడా జతకట్టడంతో మరింత ఉత్సాహంగా పాడాం. ‘పాప బలగం’ పాట పాడినప్పుడు ‘కుడివైపు పైట వేసుకొని అచ్చం మా యాదవుల పాపమ్మలాగే ఉన్నవు చెల్లె’ అని మెట్పల్లి సమీపంలోని గ్రామస్తులు తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. వస్తాను కానీ, మీ ఊళ్ల బతుకమ్మ పాట షూట్ చేసేందుకు సహకారం కావాలని అడిగినా. వాళ్లు ఒప్పుకోవడమే కాకుండా షూటింగ్ విజయవంతానికి తోడ్పాటునందించారు. ఒక్కరోజులోనే షూటింగ్ మొత్తం అయిపోయింది. ప్రతి ఆడబిడ్డను తట్టిలేపిన పాట కాబట్టే 5 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.
చిన్నప్పుడు అమ్మ నేర్పిన పాటలు, పొలంలో పనిచేస్తున్నప్పుడు నాకు ఎదురైన అనుభవాలను పాటలుగా మలిచాను. ఇప్పటివరకు 20 పాటలు రాశాను. 30 పాటలు పాడాను. మాయమైపోతున్న కుటుంబ విలువలను నా పాటలో తెలిపేందుకే యూట్యూబ్‌ను వేదిక చేసుకున్నా. భవిష్యత్తులో కూడా అలాంటి పాటలనే పాడుతాను. ఇటు పాటలతో పాటు మరోవైపు గ్రామీణ నేపథ్యంలో, తెలంగాణ యాసలోనే ఓ సినిమాకు ప్రొడ్యూసర్‌గా ఉన్నాను. ఆ సినిమా కూడా కొద్దిరోజుల్లోనే మీ ముందుకు రానుంది. గ్రామీణ స్థాయినుంచి ప్రొడ్యూసర్ వరకు వచ్చానంటే కారణం నా భర్త, నా తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహమే!
– రాజు పిల్లనగోయిన