యావత్తు ప్రపంచాన్ని కరోనా కుదిపేస్తున్న వేళ రాష్ర్టాభివృద్ధి కోసం అవిశ్రాంతంగా మేము చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కిటెక్స్ అధినేత సాబు జాకబ్‌తో వాట్సాప్‌లో చేసిన చాటింగ్ ఇంకా నాకు గుర్తుంది. అందుకే నేడు వరంగల్‌లో కిటెక్స్ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించడం ఎంతో ప్రత్యేక అనుభూతినిస్తున్నది. ఇది నిజంగా శుభవార్త. దీనివల్ల తెలంగాణలోని యువతకు వందలాది ఉద్యోగాలొస్తాయి. కిటెక్స్ గ్రూప్ ఇలాగే ఎదగాలి. మరెన్నో విజయాలను అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేసీఆర్ మానసపుత్రిక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. ఇప్పుడది దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ కావడం గర్వంగా ఉన్నది.
– కే తారక రామారావు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
వరంగల్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): వరంగల్ వస్త్రనగరికి కిటెక్స్ సిందూరమై భాసిల్లనున్నది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎంటీపీ)లో కేసీఆర్ ప్రభుత్వం నాటిన మొక్క ఉత్పత్తి ఫలాలను అందిస్తున్నది. రోజుకు 1.1 మిలియన్ (11లక్షల) కిడ్స్ రెడీమేడ్ వస్ర్తాలను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న కిటెక్స్ వరంగల్ యూనిట్లో వాణిజ్య ఉత్పత్తుల తయారీ ప్రారంభమైందని సంస్థ వర్గాలు చెప్తున్నాయి. అజంజాహి మిల్లునే కాదు.. దాని భూములను అమ్ముకున్న సమైక్య పాలకుల కుట్రలకు వరంగల్ వస్త్రనగరి విలవిలలాడింది. ‘మన రాష్ట్రంలో మన పరిశ్రమలను నెలకొల్పుకుందాం.. అజంజాహి మిల్లును తలదన్నే వస్త్రనగరిని నెలకొల్పి పూర్వవైభవాన్ని తెస్తాం’ అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అనేక సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అన్నమాట ప్రకారం వరంగల్ జిల్లా సంగెం, గీసుగొండ మండలాల్లో దాదాపు 1,300 ఎకరాల్లో కేఎంటీపీని నెలకొల్పారు. కేఎంటీపీ శంకుస్థాపన చేసిన రోజే దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీతో ఎంవోయూ కుదిరింది. ఫామ్ టు ఫ్యాబ్రిక్ నినాదంతో నాడు కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా కేఎంటీపీని రూపకల్పన చేసిన సంగతి విదితమే. గణేషా, గణేషా ఇన్ఫోటెక్ కంపెనీలు ఇప్పటికే తమ ఉత్పత్తులు ప్రారంభించి ముందుకు సాగుతున్నాయి. యంగ్ వన్ కంపెనీ త్వరలోనే ఉత్పత్తులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో కిటెక్స్ తమ తొలి యూనిట్లో వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించడంతో సర్వత్రా హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి.
కిడ్స్‌వేర్ తయారీ రంగంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కంపెనీగా కిటెక్స్‌కు పేరున్నది. 50 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ కంపెనీని కేరళకు చెందిన ఎంసీ జాకబ్ 1968లో ఎర్నాకుళం జిల్లా కిజకంబళంలో ‘అన్నా కిటెక్స్ గ్రూప్’ పేరిట స్థాపించారు. అల్యూమినియం ఉత్పత్తులతో ప్రారంభమై మసాలాలు, టెక్స్టైల్స్, సూల్, ట్రావెల్ బ్యాగ్స్ తదితర రంగాల్లోకి విస్తరించగా 1992లో ఎంసీ జాకబ్ కొడుకు సాబు ఎం జాకబ్ ‘కిటెక్స్ గార్మెంట్స్’ను స్థాపించారు. ‘లిటిల్ స్టార్’ బ్రాండ్ పేరుతో చిన్న పిల్లల దుస్తులను తయారు చేస్తున్నది. కంపెనీ ఉత్పత్తుల్లో 90 శాతం అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకించి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చూపిన చొరవతోనే తాము తెలంగాణలో పరిశ్రమను నెలకొల్పుతున్నామని, లేకపోతే తాము కార్యకలాపాలు ప్రారంభించేవాళ్లం కాదని కిటెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ సాబు ఎం జాకబ్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో యూనిట్ శంకుస్థాపన (2022 మే, 7) సందర్భంగా, అంతకుముందు ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో హైదరాబాద్‌లోనూ స్పష్టం చేశారు. నిజానికి కిటెక్స్ గ్రూప్ కొచ్చిలో రూ.3,500 కోట్లతో మెగా ప్రాజెక్టును స్థాపించేందుకు 2020 జనవరిలో కేరళ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నది. అయితే అక్కడి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించకపోవడంతో ఆ పెట్టుబడిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తామని 2021 జూలై మొదట్లో కంపెనీ ప్రకటించింది. దీంతో కర్ణాటక, తమిళనాడు, ఏపీ సహా దాదాపు 15 రాష్ట్రాలు కిటెక్స్ను సంప్రదించాయి. కిటెక్స్ను ఒప్పించడంలో నాడు కేటీఆర్ ప్రదర్శించిన మెరుపు వేగం, సమయస్ఫూర్తి కీలకపాత్ర పోషించాయి.
కేరళ నుంచి కిటెక్స్ కంపెనీ తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నదని తెలిసి జాకబ్‌తో సంప్రదింపులు జరిపారు. 2021 జూలై 9న హైదరాబాద్‌కు రప్పించారు. ఐటీసీ కాకతీయ హోటల్లో కేటీఆర్ వారితో సమావేశమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. తెలంగాణలో నిపుణులైన మానవ వనరులు, టెక్స్టైల్ రంగ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కృషి, రాష్ట్రంలో సాగవుతున్న నాణ్యమైన పత్తి తదితర అంశాలను వివరించారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న పెట్టుబడికి టీఎస్ ఐపాస్ నిబంధనల ప్రకారం మెగా ప్రాజెక్ట్ హోదా లభిస్తుందని, రాయితీ లు, ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
చివరకు ‘కాకతీయ మెగా టెక్స్ టైల్ పారులో కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించండి.. అందుకోసం హెలికాప్టర్‌ను ఏర్పాటు చేస్తాం. చూసి వచ్చాకే మరోసారి కూర్చుం దాం’ అని కిటెక్స్ బృందాన్ని హైదరాబాద్ నుంచి వరంగల్‌కు పంపించారు. కేటీఆర్ సూచనకు అనుగుణంగా ఆ బృందం టెక్స్టైల్ పార్క్‌ను పరిశీలించింది. తిరిగి హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌కు నేరుగా వెళ్లారు. తమ సంస్థను తెలంగాణకు తెప్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చూపిన చొరవ, శ్రద్ధకు కిటెక్స్ కంపెనీ బృందం ఫిదా అయింది. తెలంగాణలో తాము పెట్టుబడులు పెడతామని ప్రకటించింది.
ఒప్పందం: సెప్టెంబర్ 18, 2021. తాజ్‌కృష్ణ, హైదరాబాద్
వరంగల్ యూనిట్ శంకుస్థాపన : కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్క్, 2022