నారాయణపేట : రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, కేసీఆర్ ( KCR ) మూడోసారి ముఖ్యమంత్రి ( Chief Minister ) గా బాధ్యతలు చేపట్టడం ఖామమని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ (V. Srinivas Goud ) పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా కొడంగల్ రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో కొడంగల్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు , సర్పై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, మెతుకు ఆనంద్, కొప్పుల మహేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జెండాను మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఎగురవేసి కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓటర్ల సవరణ జాబితా తయారి కార్యక్రమంలో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త భాగస్వాములు కావాలని సూచించారు . దేశంలో అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీలలో బీఆర్ఎస్ ఒకటిగా నిలిచిందని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మించారని గుర్తుచేశారు.
భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసి ఉంటుందని పేర్కొన్నారు. అభివృద్ధితో పాటు కార్యకర్తల సంక్షేమం, గౌరవం కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు. రైతుబంధు, రుణమాఫీ, పెన్షన్ల పెంపు, బీసీ వర్గాలకు ఇచ్చిన హామీలు, గొల్ల కురుమల అభివృద్ధి పథకాల అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు. రైతులు, మహిళలు, బలహీన వర్గాల సమస్యలను ప్రభుత్వం సమర్థవంతంగా పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలన్నారు. స్వంత జిల్లాకు అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తలపై వేధింపులు, అక్రమ కేసులను ఆపి, అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.