సిటీబ్యూరో, సెప్టెంబరు 26 (నమస్తే తెలంగాణ ) : ‘చట్టం అందరికీ ఒకటే.. ఆక్రమణలు ఎకడున్నా బుల్డోజర్లు దిగాల్సిందే..ప్రజా ప్రయోజనాల కోసం భూములు సేకరించాల్సిందే’ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్న మాటలివి. కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఆ చట్టం.. నిబంధనలు కేవలం నిరుపేదలు, సామాన్య ప్రజలకే పరిమితమవుతున్నాయి.. మూసీ అభివృద్ధి, చెరువుల పునరుద్ధరణ, హైడ్రా కూల్చివేతలు, పారిశ్రామిక పెట్టుబడుల పేరుతో పేదల ఇండ్లను, అమాయక ప్రజలకు సంబంధించి ఎకరా-ఎకరా పొలాలను బలవంతంగా లాకునే సరారు.. బడా ప్రజాప్రతినిధులు, సొంత పార్టీ నేతలు, ప్రముఖుల ఆస్తుల జోలికొచ్చేసరికి తోక ముడుస్తున్నది..
వారి ఆస్తుల సంరక్షణలో డైవర్షన్ వ్యూహాన్ని అమలు చేస్తున్నది.. సొంత పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రముఖుల ఆస్తుల సంరక్షణలో ఇదే జరిగింది.. ఇందుకు కేబీఆర్ పార్ చుట్టూ హెచ్ సిటీ ప్రాజెక్టు అంశంలో సర్కారు యూటర్న్ తీసుకున్నది.. ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా రూ.1090 కోట్లతో ఏడు ఫ్లై ఓవర్లు, ఏడు అండర్‌పాస్‌ల నిర్మాణాలకు రెండేండ్ల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు..ప్రస్తుతం ఈ ప్రాజెక్టులపై పునరాలోచన, యూటర్న్ తీసుకుని కేవలం జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి నాగార్జున సర్కిల్ వరకు ఒకే ఒక ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే చాలు అని నిర్ణయం తీసుకోవడం వెనుక భారీ మతలబు ఉందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మహానగరంలో ట్రాఫిక్ చికులను తొలగిస్తామంటూ ‘హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ ఫార్మేటివ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్’ (హెచ్ సిటీ) ప్రాజెక్టు కింద కేబీఆర్ పారు చుట్టూ దాదాపు 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పర్యావరణవేత్తలు, వాకర్స్ తీవ్ర అభ్యంతరం తెలిపినా ముందస్తుగా భూ సేకరణ జరపకుండా ప్రాజెక్టు నిర్మాణాల వైపే మొగ్గు చూపారు. చివరకు అడ్డగోలుగా పర్యావరణ విధ్వంసం చెట్ల నరికివేతపై సర్కారు చర్యలపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది.
ఈ క్రమంలోనే గత ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్ చుట్టూ ట్రాఫిక్ పోలీసులతో వన్-వే నిబంధనలను అమలు చేయించింది ప్రభుత్వం. ‘చూశారా! వన్-వే పెట్టగానే ట్రాఫిక్ చికులు వీడిపోయాయి.. రూ. 1000 కోట్లకు పైగా ప్రజాధనం ఆదా అవుతుంది’ అని చెబుతూ ఇప్పుడు ఏడు ఫె్లై ఓవర్లు, అండర్ పాస్ ల ప్రతిపాదనల స్థానంలో కేవలం ఒకే ఒక ఫ్లైఓవర్కే పరిమితమవుతున్నట్లు లీకులు ఇచ్చారు..జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి నాగార్జున సరిల్ వరకు ఒకే ఒక ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తే సరిపోతుందని తుది నిర్ణయానికి వచ్చి ఈ మేరకు ప్రతిపాదనను సర్కారుకు చేర్చడం గమనార్హం. ఈ క్రమంలోనే రూ.వెయ్యి కోట్ల ప్రజాధనం ఆదా అంటూ బుకాయిస్తున్నప్పటికీ.. తెరవెనుక అసలు కారణం వేరే ఉందన్న విమర్శలు విపక్షాలు, ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
మూసీ ప్రక్షాళన, ఫార్మా విలేజ్‌లు, పారిశ్రామిక భూసేకరణల పేరిట సామాన్యుడు కట్టుకున్న ఇండ్లపైకి రాత్రికి రాత్రే నోటీసులు ఇవ్వకుండా బుల్డోజర్లు పంపించే రేవంత్ రెడ్డి సరార్.. తమ పార్టీ నేతలు, ప్రముఖుల ఆస్తుల జోలికి వచ్చేసరికి వెనకడుగు వేయడం ఏ రకమైన న్యాయమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ప్రముఖుల ఇండ్ల సేకరణకు కోట్ల రూపాయిల పరిపరిహారం చెల్లించాల్సి రావడం, అలాగే కొంతమంది ప్రముఖులు కోర్టులను ఆశ్రయించడంతో, ప్రాజెక్టును ముందుకెళ్లేలా చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిధుల లేమి ఒకవైపు, సొంత పార్టీ పెద్దల ఒత్తిళ్లు, కోర్టుల కేసులు మరొకవైపు చుట్టుముట్టడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు డైవర్షన్ డ్రామాలకు తెరలేపిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.‘పేదల భూములను గుంజుకోవడానికి లేని కోర్టు చికులు, పెద్దల ఆస్తుల దగ్గరకు వచ్చేసరికి ఎదురవుతున్నాయా?’ అని నగరవాసులు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తురన్న ఈ ద్వంద్వ విధానాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి, ఆగ్రహానికి దారితీస్తున్నాయి. సామాన్యుడికి ఒక న్యాయం, పాలకపక్ష నాయకులకు మరొక న్యాయమా అన్న ప్రశ్నకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సిటీబ్యూరో, సెప్టెంబరు 26 (నమస్తే తెలంగాణ): కేబీఆర్ పార్ చుట్టూ విస్తరణ చేపట్టాలంటే దాదాపు 450కి ప్రైవేటు ఆస్తులను, స్థలాలను భూసేకరణ చట్టం ప్రకారం సేకరించాల్సి ఉంది. ఇందులో భాగంగానే కేబీఆర్ పారు చుట్టూ ఆరు జంక్షన్ల వద్ద చేయాల్సిన స్థల సేకరణతో పాటు ఇతర ప్రాంతాలైన విరంచి హాస్పిటల్, ఎన్ఎఫీ సీ, టీవీ 9 జంక్షన్లతో కలుపుకుని కేవలం స్థల సేకరణకు రూ. 1543.82 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు అధికారులు లెకలేశారు. కానీ జీహెచ్ఎంసీ వద్ద అంత పెద్ద ఎత్తున వెచ్చించేందుకు నిధులు లేవు.
స్థల సేకరణకు ప్రత్యేకంగా సరారు నిధులు కేటాయిస్తే తప్పా, స్థల సేకరణ సాధ్యమని తేల్చారు..ఇదే సమయంలో టీడీఆర్‌లకు భూ యజమానులు ససేమిరా అంటూ వచ్చారు..మరోవైపు దాదాపు 50కిపైగా వివిధ న్యాయస్థానంలో ఫిటిషన్లు దాఖలయ్యాయి.. అన్నింటి కంటే భూ సేకరణ సవాల్‌గా మారింది. సొంత పార్టీ నేతల నుంచే తిరుగుబావుటా ఎగరవేశారు. కొందరు కోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం 92లో నివసించే మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి సంబంధించిన 250 గజాల స్థలం, జూబ్లీహిల్స్ రోడ్ నం 45లో ఉన్న హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చెందిన 377 గజాలు, మాజీ మంత్రులు సమర సింహారెడ్డి, షబ్బీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికు సంబంధించి ఒక్కొక్కరిదీ దాదాపు 300 గజాల స్థలాన్ని అధికారులు సేకరించే ప్రయత్నం చేయగా..వారి ప్రయత్నాలు ఫలించలేదు.
ఏ ఒక్కరూ భూ సేకరణకు ముందుకు రాలేదు..సమన్వయం చేయాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి కనీసం సొంత పార్టీకి సంబంధించిన నేతలనే ఒప్పించలేకపోయారు. ఇందుకు జానారెడ్డి సంఘటనే నిదర్శనం.. భూ సేకరణలో భాగంగా స్వయంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ జానారెడ్డి ఇంటికి వెళ్లి ఒప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేదు…ఇలా భూ సేకరణపై స్పష్టత లేకుండా ఏళ్ల తరబడి కాలాయాపన చేశారు. ఇందుకు పురపాలక శాఖ మంత్రిగా రేవంత్‌రెడ్డి విఫలం చెందారన్న విమర్శలు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే భూ సేకరణపై అడుగడుగునా అవాంతరాలు, న్యాయపరమైన చిక్కు ముడులు వెంటాడుతూ వచ్చిన క్రమంలో కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఆనతికాలంలోనే వన్-వే తోనే ట్రాఫిక్ సమస్య తీరిపోయిందని ప్రచారం చేసుకువస్తుండడం గమనార్హం.