Katrina Kaif | బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌కి అరుదైన గౌరవం దక్కింది. కత్రినా కైఫ్‌ని మాల్దీవుల గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ (MMPRC/ Visit Maldives) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. మాల్దీవుల పర్యాటక రంగాన్ని అంతర్జాతీయంగా ప్రోత్సహించడంలో భాగంగా కత్రినా కైఫ్‌ని నియమించినట్లు మాల్దీవ్స్ పర్యటక శాఖ వెల్లడించింది. అయితే ఈ నియమకం.. భారత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవ్స్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో జరగడం విశేషం. గత ఏడాది మాల్దీవ్స్ మంత్రులు భారత ప్రధానిపై చేసిన వ్యాఖ్యల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కత్రినా కైఫ్ నియామకం, అలాగే జూలైలో ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటనకు వెళ్లే అవకాశం ఉండటంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు కత్రినా కైఫ్ వంటి ప్రముఖ వ్యక్తిని అంబాసిడర్‌గా నియమించడం ద్వారా భారతీయ పర్యాటకులను తిరిగి ఆకర్షించి, మాల్దీవులకు వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్యను పెంచాలని మాల్దీవ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. మాల్దీవులను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మరింత బలోపేతం చేయడమే దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం.