సుల్తాన్‌బజార్, జూలై 28 : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదన్న చందంగా ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మారిందని తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం(హెచ్-1 యూనియన్) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి సాయిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం కోఠిలోని డీఎంహెచ్ఎస్ క్యాంపస్ ఆవరణలో సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్‌తో కలిసి ధర్నాలో పాల్గొన్న సాయిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం 1195-జీవో ప్రకారం జీతాలు పెంచి సంవత్సరం దాటినప్పటికీ జీవో అమలుచేయపోవడం దారుణమని మండిపడ్డారు.
సంవత్సరం దాటినా జీవోను ఇంకెప్పుడు అమలుచేస్తారని నిలదీశారు. జీతాలు పెంచాలని ప్రభుత్వం జీవో జారీ చేసినా, అధికారులు మళ్లీ ప్రభుత్వానికి లేఖ రాస్తామనడం హాస్యాస్పదంగా ఉన్నదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 1195 జీవో ప్రకారం పెంచిన జీతాలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.