హైదరాబాద్ : సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టు జోక్యాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. సోహ్రబుద్దీన్ షేక్‌తో పాటు ఆయన భార్య కౌసర్ బీ, ఆయన సన్నిహితుడు తులసీరాం ప్రజాపతి వరుసగా జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ బి.హెచ్. లోయా మరణం కూడా అప్పట్లో తీవ్ర ప్రజా వివాదానికి దారితీసింది.
అప్పటి గుజరాత్ హోంమంత్రి, ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. అమిత్ షా డిశ్చార్జ్‌కు సంబంధించిన న్యాయ ప్రక్రియ, జస్టిస్ లోయా మరణానికి సంబంధించిన పరిస్థితులు, అలాగే ఇతర నిందితులకు సంబంధించిన కేసులను కూడా చట్టపరంగా సాధ్యమైన పరిధిలో సమగ్రంగా పరిశీలించాలని సుప్రీంకోర్టును కోరారు.
ఈ కేసుల సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, విచారణ చేపడుతున్న న్యాయమూర్తులకు ప్రత్యేక భద్రత, రక్షణ కల్పించాలన్నారు. వారు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా రాజ్యాంగబద్ధమైన విధు స్వతంత్రంగా నిర్వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నారాయణ కోరారు.