తల్లిదండ్రులు-బిడ్డల మధ్య వారసత్వ తగాదాలు.. అన్నదమ్ముల నడుమ ఆస్తుల గొడవలు.. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయి. అయితే ఈ తగువులకు దేశంలోని వ్యాపార కుటుంబాలూ అతీతం కాదు. ఇంకా చెప్పాలంటే వీళ్ల మధ్యే అధికం. అలాంటి ఘటనల్ని చూశాం.. చూస్తూనే ఉన్నాం కూడా. కానీ రుయా సోదరులు ఇందుకు మినహాయింపు. తరాలు మారినా తరగని బంధంతో కలిసికట్టుగా నడుస్తున్నారు మరి. దేశ, విదేశీ వ్యాపారాల నిర్వహణలో ఈ ఉమ్మడి కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది.
Ruia Family | న్యూఢిల్లీ, జూన్ 17: వ్యాపారంపై పట్టు కోసం రోడ్డెక్కుతున్న వారసులను ఇటీవలికాలంలో ఎందర్నో చూస్తున్నాం. తమ తాతలు, తండ్రుల సంపద కోసం కోర్టుల్లో ఏండ్ల తరబడి పోరాడుతున్నవారూ ఉన్నారు. అంబానీలు, హిందుజా సోదరులతోపాటు ఎస్కార్ట్స్, రేమాండ్స్, అపోలో టైర్స్, కేకే మోదీ కుటుంబ గొడవలు తెలిసిందే. కానీ ఎస్సార్ రుయా కుటుంబం మాత్రం తమదైన రీతిలో ఒక్కటై విజయాలను సాధిస్తున్నది. మెటల్స్ దగ్గర్నుంచి పోర్టులదాకా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూపోయిన శశి రుయా, రవి రుయాలకు.. వారి కుటుంబ సభ్యులే పెద్ద బలం. అవును.. వారి పిల్లలు, వాళ్ల పిల్లలు ఇలా మూడు తరాలు తరగని బంధంతో ఒక్కటై వెళ్తున్నారు. దేశ, విదేశాల్లోని వ్యాపారాలను ఉమ్మడిగా నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.
55 ఏండ్లపైనే..
1969లో తొలి తరం రుయాలైన శశి, రవి రుయా సోదరులు ఎస్సార్ గ్రూప్‌ను స్థాపించారు. అప్పుడే మద్రాస్ పోర్ట్ ట్రస్టు నుంచి రూ.2.5 కోట్ల విలువైన మొదటి ఆర్డర్‌ను అందుకున్నారు. అప్పట్నుంచి క్రమేణా వ్యాపారాలను విస్తరించుకుంటూపోయారు. నిజానికి తొలినాళ్లలో నిర్మాణ, ఇంజినీరింగ్ రంగాలపైనే రుయాలు దృష్టిపెట్టారు. కానీ 1980వ దశకంలో విద్యుత్తు, చమురు, గ్యాస్ రంగాల్లోకీ వచ్చారు. ఇక 1990ల్లో ఉక్కు, టెలికం రంగంల్లోకీ ప్రవేశించారు. అయితే వ్యాపార విస్తరణలో భాగంగా తీసుకున్న రుణాలు.. రుయాలను అప్పుల ఊబిలోకి నెట్టాయి. నిజానికి 2012లో ప్రపంచంలోనే అత్యంత భారతీయ ధనవంతులుగా రుయా సోదరులు 7 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ జాబితాలో నిలిచారు. అయితే పెరిగిన రుణ భారాన్ని దించుకునే క్రమంలో టెలికం సంస్థను, ఆయిల్ రిఫైనరీ, స్టీల్ ప్లాంట్లను అమ్ముకోవాల్సి వచ్చింది. ఇలా రూ.2 లక్షల కోట్లకుపైగా రుణాలను తగ్గించుకున్నారు. ఇప్పుడు ఎస్సార్ గ్రూప్ తిరిగి ఆవిష్కృతమవుతున్నది.
అంతా ఒక్కచోటనే..
ముంబై, ఢిల్లీ, లండన్లలో రుయా సోదరుల కుటుంబాలు దాదాపు 60 ఏండ్లుగా కలిసే జీవిస్తున్నాయి. కొడుకులు, మనుమలు-మనుమరాండ్లు కుటుంబ వ్యాపారాలను ఒక్కటై చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఎస్సార్ గ్రూప్.. ఎనర్జీ, మెటల్స్, మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్, టెక్నాలజీ, రిటైల్ రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్నది. 14 పోర్ట్‌ఫోలియో కంపెనీలున్నాయి. భారత్‌తోపాటు బ్రిటన్, వియత్నాంలలో ఆయిల్ రిఫైనరీ, పవర్ ప్లాంట్లున్నాయి. 35కుపైగా దేశాల్లో ఐటీ సొల్యూషన్స్‌ను అందిస్తున్నది. రెన్యువబుల్స్ ఎనర్జీలోకీ ప్రవేశించింది. గ్రూప్ రెవిన్యూ దాదాపు 15 బిలియన్ డాలర్లు. ఆస్తులు సుమారు 8 బిలియన్ డాలర్లపైనే.
కుటుంబ సభ్యులందరం కలిసే ఉంటాం. గ్రూప్‌లోని ఒక్కో వ్యాపార విభాగాన్ని ఒక్కొక్కరం చూసుకుంటాం. లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం సమష్ఠిగా కృషి చేస్తాం. ఆలోచనల్ని, సంతోషాల్ని పంచుకుంటాం. సలహాల్ని ఇచ్చిపుచ్చుకుంటాం. కొత్త తరాలు వస్తున్నా.. మా ఈ బంధం బలపడుతూనే ఉండటం ఆనందంగా ఉన్నది. 12 ఏండ్ల వయస్సు నుంచే నేను సెలవు రోజుల్లో నాన్నతో కలిసి పనిచేయడం మొదలు పెట్టాను. కుటుంబంలోని పెద్దవారంతా తర్వాతి తరాలకు ఉమ్మడి కుటుంబం లాభాలను వివరిస్తూపోతున్నాం.
-ప్రశాంత్ రుయా, శశి రుయా కుమారుడు