హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (జేఎన్జే) సభ్యులకు కాంగ్రె స్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి పేట్బషీరాబాద్లో కేటాయించిన 37 ఎకరాల భూమిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రహస్యంగా లాక్కున్నది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఈ భూములను ఆరు నెలల క్రితమే సమీకృత పాఠశాల నిర్మాణానికి కేటాయిస్తూ ప్రొసిడింగ్స్ జారీచేసింది. ఈ మేరకు మార్చి 23న మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టర్ ఆదేశాలతో సదరు ల్యాండ్‌ను సర్వే చేసి కుత్బుల్లాపూర్ తహసీల్దార్ సంబంధిత ఇంటిగ్రేటెడ్ సూల్ యాజమాన్యానికి స్థలాన్ని (పొజిషన్) అప్పగించారు. ఈ ఉత్తర్వులు తాజాగా బహిర్గతం కావడంతో ప్రభుత్వ తీరుపై జేఎన్జే సభ్యులు మండిపడుతున్నారు. జేఎన్జే జర్నలిస్ట్‌లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిండా ముంచారని, కాంగ్రెస్ సర్కార్ నమ్మించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జర్నలిస్టుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట తప్పారని మండిపడుతున్నారు. 2024లోనే రవీంద్రభారతిలో ఆర్భాటంగా జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో సభ పెట్టి, మెమో ద్వారా భూమి ఇస్తున్నట్టు ప్రకటించి, ఇప్పుడు సదరు భూ మిని వెనకి తీసుకున్నారని వాపోతున్నారు.
మేడ్చల్-మలాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పరిధిలోని పేట్బషీరాబాద్లో గతంలో జర్నలిస్టులకు కేటాయించిన సదరు భూమిని ఇంటిగ్రేటెడ్ సూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం ముందస్తుగా కేటాయించింది. ఈ మేరకు సర్వే నంబర్ 25/2 పరిధిలోని 37.00 ఎకరాల భూమిని సమీకృత పాఠశాల భవనాల నిర్మాణం కోసం విద్యాశాఖకు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ మికిలినేని మనుచౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భూమి వినియోగంపై కలెక్టర్ పలు స్పష్టమైన షరతులు విధించారు. కేటాయించిన స్థలానికి రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, పూర్తిగా పాఠశాల కాంప్లెక్స్ నిర్మాణం కోసమే వినియోగించాలని ఆదేశించారు. ఈ భూమి యాజమాన్య హకులు ప్రభుత్వానికే ఉంటాయని, భవిష్యత్తులో ఇతర ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైతే వెనకి తీసుకొనే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టంచేశారు. ఈ స్థలాన్ని ఉత్తర్వులు వెలువడిన మూడు నెలల్లోపు సంబంధిత అవసరాలకు వినియోగించకపోతే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే రద్దు చేస్తామని పేరొన్నారు. హైకోర్టులో ప్రస్తుతం నడుస్తున్న రిట్ పిటిషన్ల (డబ్ల్యూపీ నంబర్ 32882/2025, 32442/2025) తుది తీర్పులకు లోబడి ఈ కేటాయింపు ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు. స్థల సరిహద్దులను గ్రౌండ్ లెవల్లో స్పష్టంగా గుర్తించి, పంచనామా, సెచ్ వివరాలతో తక్షణమే విద్యాశాఖ అధికారులకు అప్పగించాలని కుత్బుల్లాపూర్ తహసీల్దార్‌ను ఆదేశించారు. అనంతరం పూర్తిస్థాయి ప్రతిపాదనలను నిబంధనల ప్రకారం ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీకి సమర్పించాలని సూచించారు.