Bhatti Vikramarka | హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో సోమవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఏండ్లు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, కాంట్రాక్ట్ బిల్లులు విడుదల కాకపోవడంతో విసిగివేసారిన రిటైర్డ్ ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార చాంబర్ ఎదుట మరోసారి బైఠాయించి ఆందోళనకు దిగారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భట్టి విక్రమార్క చాంబర్‌ను ముట్టడించటం ఇది మూడోసారి. బాధితులు సచివాలయం లోపలికి వచ్చి మరీ ఆర్థిక మంత్రి కార్యాలయం ఎదుట బైఠాయించడం కలకలం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, దవాఖానలు, మౌలిక వసతుల నిర్మాణాలు చేపట్టి ఏండ్లు గడుస్తున్నా బిల్లులు అందకపోవడంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయామని చిరు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తంచేశారు. పనులు పూర్తి చేసి ట్రెజరీల చుట్టూ తిరుగుతున్నా కేవలం టోకెన్ నంబర్లే ఇస్తున్నారని, ఖాతాల్లో మాత్రం పైసలు జమ కావడం లేదని మండిపడ్డారు. అప్పులపాలై, ఫైనాన్షియర్ల ఒత్తిళ్లు తట్టుకోలేక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వాపోయారు. నిధులు విడుదలయ్యే వరకు సచివాలయం నుంచి వెళ్లేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు.
మరోవైపు సర్వీస్ ముగిసిన తర్వాత తమకు గ్రాట్యుటీ, జీపీఎఫ్, కమ్యూటేషన్ వంటి ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ అందకపోవడంతో వృద్ధాప్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. జీవితాంతం ప్రభుత్వ సేవకే అంకితమై ఉద్యోగ విరమణ పొందితే, హక్కుగా దకాల్సిన బెనిఫిట్స్ కోసం కాళ్లరిగేలా తిరగాల్సి వస్తున్నదని కన్నీటిపర్యంతమయ్యారు.
తమ సమస్యల పరిషారం కోసం ఉన్నతాధికారులు, ఆర్థికశాఖ కార్యదర్శి చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణ చేసినా ఫలితం లేకుండా పో యిందని, బాధ్యతాయుత స్థానంలో ఉన్న నే తలు సైతం తమవైపు చూడటం లేదని రిటైర్డ్ ఉద్యోగులు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమారతోపాటు ఫైనాన్స్ సెక్రటరీని కలిసేందుకు ప్రయత్నిస్తే అధికారులు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తిప్పి పంపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. డిప్యూటీ సీఎం స్వయంగా వచ్చి తమ వినతిని స్వీకరించి, స్పష్టమైన హామీ ఇచ్చేవరకు చాం బర్ ముందు నుంచి కదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనను హోరెత్తించారు. సచివాలయం లోపల, మంత్రుల చాంబర్ వద్దే ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో భద్రతా సిబ్బంది, పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. ఆందోళనకారులను బలవంతంగా అకడి నుంచి తరలించేందుకు యత్నించడంతో పోలీసులు, బాధితులకు మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటుచేసుకున్నది. న్యాయంగా రావాల్సిన బకాయిలు అడిగితే అణచివేసే ధోరణి ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని బాధితులు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, లేదంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : పరిపాలనకు అత్యున్నత కేంద్రంగా నిలువాల్సిన రాష్ట్ర సచివాలయం కాంగ్రెస్ పాలనలో నిరసనలకు వేదికగా మారడం అత్యంత సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రిటైర్డ్ ఉద్యోగులు, చిన్న కాంట్రాక్టర్లు తమ న్యాయమైన హకుల కోసం సచివాలయంలో ఆందోళనకు దిగాల్సిన దుస్థితి రావడం సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని మండిపడ్డారు. ఏండ్ల తరబడి వారి బిల్లులను పెండింగ్‌లో పెట్టడమే గాక తప్పించుకు తిరుగుతున్నదని సోమవారం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

బడా కాంట్రాక్టర్లకు రూ.కోట్లాది బి ల్లులను చకచకా విడుదల చేస్తున్న ప్రభు త్వం, చిన్న కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను ఎందుకు తొకిపెడుతున్నదని హరీశ్‌రావు నిలదీశారు. పెం డింగ్ బిల్లుల విడుదలకు 20 నుంచి 30శాతం కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని ఆర్థిక మంత్రి చాంబర్ ముందే ఆందోళనలు జరిగాయని గుర్తుచేశారు. ఆ స్థాయిలో కమీషన్లు ముట్టజెప్పలేదనే కక్షతోనే పేద, మధ్యతరగతి చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను ఆపుతున్నారా? అని ప్రశ్నించారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలని కోరారు.