మద్దూర్, సెప్టెంబర్ 28 : నారాయణపేట జిల్లా మద్దూరు పట్టణంలోని పేదల ఇండ్లపైకి మరోసారి బుల్డోజర్లు విరుచుకుపడ్డాయి. సీఎం రేవంత్రెడ్డి ఇలాకాలో రోడ్డు విస్తరణ పేరుతో పేద, సామాన్యుడి గూడును కూల్చారు. దీంతో వారి జీవనాధారం ప్రశ్నార్థకంగా మారింది. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి నమ్మించి జనంతో ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ నేతలు తర్వాత జనంపై విరుచుకుపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ సర్కార్ కర్కశత్వానికి 60 కుటుంబాలు గూడు కోల్పోగా.. మరో 20 కుటుంబాలు ఇండ్లతోపాటు వ్యాపార దుకాణాలను కోల్పోయి నిల్వ నీడ లేకుండా పోయాయి. నేటి కాంగ్రెస్ పాలన చూస్తుంటే రజాకార్ల పాలన గుర్తొస్తున్నదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మద్దూరు పట్టణం నుంచి చింతల్దిన్నె వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. నిబంధనలు పాటించకుండా పనులు చేపట్టడంపై స్థానికులు తిరగబడ్డారు. పరిహారం ప్రకటించే వరకు తమ ఇండ్ల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. అధికారులు.. పోలీసులను అడ్డుపెట్టి మరీ ఇండ్లను నేలమట్టం చేశారు. కనీస సమాచారం లేకుండా.. ఒక్క నోటీస్ కూడా ఇవ్వకుండా ఇండ్లపై బుల్డోజర్లను తీసుకురావడం ఏమిటని బాధితులు నిలదీశారు.
ఉన్న గూడు కూల్చివేస్తే తాము కట్టుబట్టలు, సామగ్రితో ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. తమ ఉసురుపోసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని శపించారు. కండ్ల ముందే కూలుతున్న నిర్మాణాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తమ బతుకులను రోడ్డున పడేసినోడి బతుకు సర్వ నాశనం కావాలంటూ శపించారు. తమ సామగ్రిని సర్దడానికైనా కొంత సమయం ఇవ్వాలని వేడుకున్నా.. వినకుండా బలప్రదర్శన చేశారు. కూల్చివేతలు నిలిపివేయాలని అడ్డుకోవడానికి వెళ్లిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా ఎదు ట నోరు తెరిస్తే మొత్తం ఇండ్లను కూల్చేస్తామంటూ స్థానిక నేతలు బాధితులకు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. బాధితుల వాదనలు వినకుండా.. కనీసం వారితో చర్చించకుండా నోటీసుల ఊసే లేకుండా ఇండ్లను కూల్చడంపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధితులకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకొన్నారు. అధికార పార్టీ నేతల అం డదండలే హద్దుగా రెచ్చిపోయి అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్టేషన్లకు తరలించారు. మున్సిపల్ కేంద్రం నుంచి చింతల్దిన్నెకు అం త పెద్ద రోడ్డు అవసరం లేకున్నా అధికారులు పేదలపై పగబట్టి ఈ దుస్సాహసానికి ఒడిగట్టారంటూ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇండ్లు, వ్యాపార సముదాయాలు కోల్పోతున్న బాధితులకు పరిహారం ఇచ్చి కూల్చివేతలు చేపట్టాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సూచించారు. సోమవారం నారాయణపేట జిల్లా మద్దూర్లో రోడ్డు విస్తరణ పేరుతో జరిగిన ఇండ్ల విధ్వంసంపై ఆయన ఒక ప్రకటనలో స్పందించారు. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని నియోజకవర్గ ప్రజలు ఆనందపడితే.. ఇప్పుడేమో అరాచక పాలనకు తెరలేపారని దుయ్యబట్టారు. పేదల కష్టాలను తొలగించాల్సిన సీఎం వారిని ఇంకా కష్టాల్లోకి నెడుతూ.. ఉన్న గూడును కూల్చుతూ నిలువ నీడలేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఓ వైపు భూములు గుంజుకుంటూ.. మరోవైపు ఇండస్ట్రియల్ కారిడార్లో బినామీ రైతుల పే రుతో రూ.కోట్లు కొల్లగొట్టి.. రేడియల్ రోడ్ల పే రిట పేద ప్రజల భూములను చెరబడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఇకనైనా విధ్వంసపాలన ఆపకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.