KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు(KTR )మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. హర్యానాలోని ప్రముఖ ఓ.పీ. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి(Jindal Global University) విచ్చేసి విద్యార్థులు, అధ్యాపకులతో సంభాషిం చడంతో పాటు వారిని ఉద్దేశించి ‘డిస్టింగ్విష్డ్ పబ్లిక్ లెక్చర్’ ఇవ్వాలని యూనివర్సిటీ కేటీఆర్‌ను ఆహ్వానించింది. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ (డాక్టర్) సి. రాజ్ కుమార్ ఈ మేరకు కేటీఆర్‌కు ప్రత్యేకంగా లేఖ రాశారు. కేటీఆర్ రాక, ఆయన ఆలోచనలు, ప్రసంగం విద్యార్థులకు ఎంతో స్ఫూర్తి, ప్రేరణ కలిగిస్తాయని పేర్కొన్నారు. కేటీఆర్‌కు అనుకూలమైన తేదీ, సమయాన్ని బట్టి సెప్టెంబర్, అక్టోబర్ 2026లో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన భారత్‌లోనే తొలి రాజ్యాంగ మ్యూజియం, రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ అకాడమీని సందర్శించాలని కూడా కేటీఆర్‌ను ఆహ్వానించారు.
భారత రాజ్యాంగం ఆమోదానికి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ రాజ్యాంగ మ్యూజియంలో రాజ్యాంగ నిర్మాణ సమయంలో ఎదురైన పోరాటాలు, సవాళ్లు, రాజ్యాంగ నిర్మాతల కృషిని ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 2009లో స్థాపించిన ఓ.పీ. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ప్రస్తుతం దేశంలోని ప్రముఖ బహుళ విభాగాల, పరిశోధనాధారిత విద్యా సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ 16 వేల మందికిపైగా విద్యార్థులు, 1,100 మందికిపైగా పూర్తిస్థాయి అధ్యాపకులు ఉన్నారు. 50కి పైగా దేశాలకు చెందిన అధ్యాపకులు, 160 దేశాలకు చెందిన విద్యార్థులతో అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ విశ్వవిద్యాలయం, ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లోని 600కుపైగా ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యాలు కలిగి ఉంది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లోనూ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ విశేష గుర్తింపు సాధించింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ లెర్నింగ్ ర్యాంకింగ్స్–2024లో గోల్డ్ రేటింగ్ పొందడంతో పాటు, క్యూఎస్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో వివిధ విభాగాల్లో ప్రముఖ స్థానాలు దక్కించుకుంది. 2020లో భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నుంచి ‘ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్’ హోదాను కూడా పొందింది. గతంలో రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, భారత ప్రధాన న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సహా పలువురు ప్రముఖులు జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేటీఆర్ ఈ ఆహ్వానాన్ని స్వీకరించి యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులతో తన ఆలోచనలను పంచుకుంటారని యూనివర్సిటీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. యూనివర్సిటీ విద్యార్థులతోపాటు అధ్యాపకులతో సంభాషించేందుకు ఆహ్వానం పంపినందుకు కేటీఆర్. ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులతో సంభాషించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, కచ్చితంగా యూనివర్సిటీ పంపిన ఆహ్వానం మేరకు హాజరు అవుతానని కేటీఆర్ తెలిపారు.