వాషింగ్టన్: వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ నియరెస్ట్ ప్లేస్ గురించి విన్నాంగానీ.. ‘వర్క్ ఫ్రమ్ స్పేస్’ ఏంటి అనుకుంటున్నారా? ఆశ్చర్యపోకండి. అంతరిక్షం నుంచి ఆఫీసు పని చేసే రోజులు త్వరలోనే రానున్నాయి. పెండ్లి వేడుకలు, బిజినెస్ మీటింగ్‌ల కోసం అలా ఆకాశపుటంచులను చుట్టివచ్చేందుకు మరెంతో సమయం పట్టేలా లేదు. రోదసిలో వాణిజ్య అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అమెజాన్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ జెఫ్ బెజోస్ సమాయత్తమయ్యారు. ‘ఆర్బిటాల్ రీఫ్ బిజినెస్ పార్క్’ పేరిట ఈ స్పేస్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నట్టు ‘బ్లూ ఆరిజన్’ సంస్థ ఇటీవల ప్రకటించింది. స్పేస్‌స్టేషన్ నిర్మాణ కార్యకలాపాల కోసం 2025 తర్వాత స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపనున్నట్టు వెల్లడించింది. భూమికి 500 కిలోమీటర్ల ఎత్తులో, 32 వేల చదరపు అడుగుల్లో ఈ పార్కును ఏర్పాటు చేయబోతున్నారు. ఏకకాలంలో పది మందికి చోటు ఉండేలా దీన్ని నిర్మిస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలతో పాటు టూరిజం, వేడుకలకు అనుగుణంగా దీన్ని రూపొందిస్తున్నారు. గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో రోజుకు సగటున భూమి చుట్టూ 16 పరిభ్రమణాలను ఈ పార్కు చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. పార్కులో ఉన్నవారికి ప్రతి 90 నిమిషాలకు ఒకసారి సూర్యోదయ దృశ్యాలు కనిపిస్తాయని వెల్లడించారు.