టోక్యో : జపనీస్ పరిశోధకులు కళ్లు చెదిరే వేగంతో పని చేసే ఇంటర్నెట్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. మన దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం కన్నా సుమారు 16 మిలియన్ రెట్ల వేగంతో ఈ ఇంటర్నెట్ సేవలు అందుతాయి. అంటే, ఈ జపనీస్ ఇంటర్నెట్ సెకండ్‌కు 1.02 పెటాబిట్స్ వేగంతో పని చేస్తుంది. ఇది గ్లోబల్ డాటా షేరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్‌ను పునర్నిర్వచించే మైలురాయి వంటి విజయం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ, సుమిటోమో ఎలక్ట్రిక్ అండ్ ఇంటర్నేషనల్ రీసెర్చర్స్ కలిసి ఈ విజయాన్ని సాధించాయి. స్టాండర్డ్ సైజ్డ్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ను ఉపయోగించి, సెకన్‌కు 1.02 పెటాబిట్స్ వేగంతో డాటాను 1,808 కి.మీ. దూరానికి ట్రాన్స్మిట్ చేసి చూపించారు. ఈ ఇంటర్నెట్ ద్వారా మొత్తం నెట్‌ఫ్లిక్స్ డాటాను ఒకే ఒక సెకన్లో డౌన్లోడ్ చేయవచ్చునని నిపుణులు చెప్తున్నారు. లక్షలాది 8కే అల్ట్రా హెచ్డీ వీడియోలను ఏకకాలంలో స్ట్రీమ్ చేయవచ్చునని అంటున్నారు.