Farooq Ahmad | తల్లిదండ్రుల సేవ అనగానే గుర్తుకొచ్చే పేరు.. శ్రవణకుమారుడు. ఇలాంటి ఓ తనయుడు శ్రీనగర్‌లో కూడా ఉన్నాడు. వృద్ధులైన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం అతని నుంచే నేర్చుకోవాలి. రోడ్డు పక్కన చాయ్ అమ్ముతూనే, చక్రాల కుర్చీకే పరిమితమైన తల్లిని ఎంతో బాధ్యతగా చూసుకుంటున్నాడు. ఆ చాయ్‌వాలా పేరు ఫారూఖ్ అహ్మద్. ఆయన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు. ఫారూఖ్ అహ్మద్ వైవాహిక జీవితం ఎక్కువ కాలం సాగలేదు. అంతలోనే తమ్ముడు పెండ్లి చేసుకుని వేరు కాపురం పెట్టాడు. దీంతో తల్లి బాధ్యత తానే తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఫారూఖ్ నడి వయసుకు చేరుకున్నాడు. ‘మా అమ్మకు వెన్నునొప్పి. గుండె రుగ్మత, ఇతర ఆరోగ్య సమస్యలూ ఉన్నాయి. ఉన్నంతలో ఆమెను బాగా చూసుకుంటున్నాను’ అంటాడు ఫారూఖ్. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. తల్లిని కూడా దుకాణానికి తీసుకొస్తాడు. మళ్లీ ఏ అర్ధరాత్రో ఆమెతో కలిసి ఇంటికొస్తాడు.
ఐదేండ్లుగా ఫారూఖ్ దినచర్య ఇలానే జరిగిపోతున్నది. కుండపోత వర్షంలో తన తల్లి వీధిలో గడపాల్సి రావడం తనకు బాధ కలిగిస్తుందని చెబుతాడు. చలికాలంలో తల్లికి ఏ ఇబ్బందీ లేకుండా వెచ్చని ఉన్నిదుస్తులు కొనిపెట్టాడు. చాయ్ కోసం వచ్చిన కస్టమర్లతో కబుర్లు చెబుతూ ఆమె ఒంటరితనాన్ని మర్చిపోతుంది. రెండు పూటలా వంట బాధ్యత కూడా అతనిదే. ‘అందరికీ ఇలాంటి కొడుకునే ఇవ్వమని దేవుణ్ని ప్రార్థిస్తాను. నన్ను మా ఫారూఖ్ పసిబిడ్డలా చూసుకుంటాడు. స్నానం చేయిస్తాడు. ఒక్క క్షణమైనా ఒంటరిగా వదిలిపెట్టడు. ఇకనైనా మా అబ్బాయికి మంచిరోజులు రావాలని, ఓ తోడు దొరకాలనీ కోరుకుంటున్నా” అంటూ ఆనంద బాష్పాలు రాలుస్తుంది ఆ తల్లి.
“Telangana | ప్రకృతి కోసం ఎనిమిదేండ్లుగా అంకితం.. ఇప్పుడు భార్యాపిల్లలు కూడా అతని బాటలోనే”