Egg | వాషింగ్టన్: ఇకపై గుడ్డు నుంచి ఎక్కువ పోషకాలు మీకు లభించాలంటే దాన్ని ఉడకపెట్టడంపై దృష్టి పెట్టాల్సిందేనంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు! పచ్చ సొన, తెల్ల సొనలను ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉడికించకూడదని చెప్తున్నారు. గుడ్డును ఎలా ఉడికించాలో తమ అధ్యయనంలో గుర్తించారు. ‘కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్’ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, పచ్చ సొన 65 డిగ్రీల సెల్సియస్, తెల్ల సొన 85 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద గట్టిపడటం మొదలవుతుంది. 12 నిమిషాల సేపు 100 డిగ్రీల సెల్సియస్ వద్ద పెంకులోనే పచ్చ సొన, తెల్ల సొనలు గట్టిపడే వరకు ఉడికించినపుడు, గుడ్డులోని అన్ని భాగాల అంతిమ ఉష్ణోగ్రత 100 డిగ్రీలు ఉంటుంది.
ఇది వంటకు, మరీ ముఖ్యంగా పచ్చ సొన విషయంలో సరైన ఉష్ణోగ్రత కన్నా ఎక్కువని శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో తేల్చారు. ఎగ్ సాస్ విషయంలో అయితే గుడ్డును 60-70 డిగ్రీల మధ్యలో ఉడికించినపుడు, అంతిమ గుడ్డు ఉష్ణోగ్రత 65 డిగ్రీలు ఉంటుంది. 100 డిగ్రీల వద్ద ఆరు నిమిషాలపాటు ఉడికిస్తే, పచ్చ సొన సరిగ్గా ఉడకదు. గుడ్డు సక్రమంగా ఉడకాలంటే, 100 డిగ్రీల వద్ద బాయిలింగ్ వాటర్ సాస్ప్యాన్ను, 30 డిగ్రీల వద్ద (నులివెచ్చని) నీటితో సాస్ప్యాన్ను ఉపయోగించాలి. గుడ్డును ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి వీటిలో ఒకదాని నుంచి మరొకదానికి మార్చాలి. సరిగ్గా 32 నిమిషాలపాటు ఈ విధంగా చేస్తే గుడ్డు రుచికరంగా, మంచి పోషక విలువలతో ఉడుకుతుంది.