జడ్చర్ల : బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల ( Irrigation Projects ) పై నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుందని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి (C. Laxma Reddy ) ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం అంబేద్కర్ కళా భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జిల్లా ప్రజలకు వరంలాంటిదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన మొట్టమొదటి ఇరిగేషన్ ప్రాజెక్టు అని గుర్తు చేశారు.
పాలమూరు రంగారెడ్డి ( Palamur Rangareddy ) ప్రాజెక్టు భూసేకరణకు కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి అడ్డుకున్నారని ఆరోపించారు. భూసేకరణ విషయంలో కూడా కేవలం కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి ప్రాజెక్టు పనులు ముందుకు సాగనివ్వలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్దండాపూర్ ప్రాజెక్టును మొత్తం మూడు ప్యాకేజీలుగా పనులు చేపట్టామని వివరించారు. రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దండాపూర్ పనులు ఆలస్యంగా ప్రారంభించామని వెల్లడించారు.
దాదాపు ఐదు వేల కోట్లు ఉద్దండపూర్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందని, గడిచిన రెండున్నర కాంగ్రెస్ పాలనలో ఐదు వందల కోట్లు మాత్రమే రిలీజ్ చేశారని ఆరోపించారు. రైతులకు ఎకరానికి రూ.11 లక్షల నుంచి 16 లక్షల ముప్పై వేలకు పరిహారం కింద అందజేశామని వివరించారు. ఎన్నికల్లో రూ. 25 లక్షలకు ప్యాకేజీ పెంచుతామని కాంగ్రెస్ మాట ఇచ్చి, ఒక్క రూపాయి కూడా పెంచలేదని విమర్శించారు.
ఆర్ అండ్ ఆర్ సెంటర్ కోసం అందరినీ ఒప్పించి మూడు వందల ఎకరాలు సేకరించామని వెల్లడించారు. భూ నిర్వాసితులకు అడుగడుగునా అండగా ఉన్నామని తెలిపారు. ఉద్దండపూర్ విషయంలో రెండున్నర ఏండ్లు రాజకీయం చేయలేదని, నిర్వాసితులు బాగుపడటమే తమ పార్టీ ధ్యేయమని స్పష్టం చేశారు.