తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన హైదరాబాద్‌లో ఐటీ ఎగుమతులు, ఐటీ ఉద్యోగావకాశాలు రెట్టింపయ్యాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. గురువారం హైదరాబాద్ సాప్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన హైసియా ఇన్నోవేషన్ సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. 90 దశకంలో హైదరాబాద్‌లోని అమీర్‌పేట కేంద్రంగా సాప్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) ప్రారంభం కాగా, ఆ తర్వాత పరిమిత ఐటీ కంపెనీలతో మాదాపూర్ హైటెక్ సిటీ కేంద్రంగా హైదరాబాద్ సాప్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) ప్రస్థానం మొదలైందన్నారు.
ఎలాంటి అంచనాలు లేకుండా ప్రారంభమైన హైదరాబాద్ ఐటీ రంగం ప్రస్థానం ఇప్పుడు దేశంలోనే అగ్రస్థానం దిశగా దూసుకెళ్తోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ, ఎస్ఏఎస్, యానిమేషన్ అండ్ గేమింగ్ సర్వీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీఎఫ్ఎస్ఐ తదితర రంగాల్లో పది కన్సార్టియంలు ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తుందన్నారు. చిన్న, మధ్యస్థ రంగాల్లో ఉపాధి అకకాశం కల్పిస్తున్నారన్నారు.
కరోనా కాలంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్బిలిటీ ద్వారా రకరకాల కార్యక్రమాలు నిర్వహించిన హైసియా సేవలను ఆయన ప్రశంసించారు. జాబ్‌మేళాలను నిర్వహించి వేలాదిమందికి ఐటీ/ఐటీఈఎస్ రంగాల్లో ఉద్యోగావకాశాలను కల్పించిన ఘనత హైసియాదే అన్నారు. ఐటీ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2016లో మొదటిసారిగా ఐటీ పాలసీని తీసుకువచ్చిందని, అది మంచి ఫలితాలు ఇవ్వడంతో రెండో ఐటీ పాలసీని ఈ ఏడాది ఆగస్టులో తీసుకువచ్చామని గుర్తు చేశారు.
హైదరాబాద్ కేంద్రంగా ఐటీ రంగం ఏర్పాటుకు విశేషంగా కృషి చేసిన హైసియా మొట్టమొదటి అధ్యక్షులు జే. ఏ. చౌదరికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అందజేశారు. ఈ సందర్బంగా జే. ఏ.చౌదరి మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా ఐటీకి మంచి భవిష్యత్ ఉంటుందని ఊహించాం కానీ, ఈ స్థాయిలో ఉంటుందనుకోలేదన్నారు. మాదాపూర్‌లో ప్రభుత్వం 10 ఎకరాలను కేటాయిస్తే అందులో 4 ఎకరాలను విప్రోకు ఇచ్చి, మిగతా స్థలంలో సైబర్ టవర్ పేరుతో హైటెక్ సిటీ నిర్మించామని, అలాంటి హైటెక్ సిటీకి ఇప్పుడు ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు వచ్చాయని చెప్పారు. సమావేశంలో హైసియా అధ్యక్షులు భరణి అరోల్లతో పాటు పలువురు ఐటీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.