(ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) చాంపియన్‌గా అవతరించింది. లీగ్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన హైదరాబాద్ టైటిల్ విజేతగా నిలిచింది. తుది పోరులో నిలిచిన తొలిసారే కప్‌ను ముద్దాడి కొత్త చరిత్ర లిఖించింది. ఆదివారం ఆద్యంతంఆసక్తికరంగా సాగిన ఫైనల్ పోరులో హెచ్ఎఫ్సీ కేరళ బ్లాస్టర్స్‌పై అద్భుత విజయం సాధించింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. అభిమానులు ఊపిరి బిగపట్టుకుని
మునివేళ్లపై మ్యాచ్‌ను వీక్షించిన వేళ.. హలీచరణ్ గోల్‌తో హైదరాబాద్ గెలుపు సంబురాల్లో మునిగిపోయింది. మొత్తంగా దేశ ఫుట్‌బాల్ యవనికపై హైదరాబాద్ పేరు మరోమారు మార్మోగింది.
ఫట్రోడా: ఐఎస్ఎల్లో అద్భుతం ఆవిషృతమైంది. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా మిగిలిన కప్ ఎట్టకేలకు దరి చేరింది. ఆదివారం నెహ్రూ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ పోరులో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) 3-1(పెనాల్టీ షూటౌట్) తేడాతో కేరళ బ్లాస్టర్స్‌పై చరిత్రాత్మక విజయం సాధించింది. ఫైనల్ చేరిన తొలిసారే హెచ్ఎఫ్సీ టైటిల్‌ను ముద్దాడి కొత్త చరిత్ర లిఖించింది. మరోవైపు మూడు సార్లు ఫైనల్లో తలపడిన కేరళ మరోమారు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మ్యాచ్ విషయానికొస్తే నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోరు 1-1తో సమమైంది. హెచ్ఎఫ్సీ తరఫున సాహిల్ తవోరా(88ని) గోల్ చేయగా, కేరళకు రాహుల్(68ని) ఏకైక గోల్ అందించాడు. స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ అదనపు సమయానికి దారితీసింది.
మరో 30 నిమిషాల పాటు జరిగిన ఆటలో గోల్స్ నమోదు కాకపోవడంతో పెనాల్టీ షూటౌట్ తప్పనిసరి అయ్యింది. షూటౌట్లో హైదరాబాద్ తరఫున జావో విక్టర్, ఖాసా కమారా, హలీచరణ్ నర్జారీ గోల్స్ చేయడంతో గెలుపు సంబురాల్లో మునిగిపోయింది. తొలిసారి టైటిల్ ఒడిసిపట్టిన ఆనందంలో ఆటగాళ్లు ఉద్వేగానికి లోనయ్యారు. మొత్తంగా లీగ్‌లో టైటిల్ గెలిచిన ఐదో జట్టుగా హైదరాబాద్ నిలిచింది. గోల్‌కీపర్ లక్ష్మికాంత్ కట్టిమణి హైదరాబాద్ హీరోగా నిలిచాడు. పెట్టని గోడలా ప్రత్యర్థి దాడులను దీటుగా తిప్పికొడుతూ హైదరాబాద్ టైటిల్ గెలువడంలో కీలక భూమిక పోషించాడు.
ఆది నుంచే హోరాహోరీ
ఎలాగైనా టైటిల్‌ను ముద్దాడాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన హెచ్ఎఫ్సీ, కేరళ బ్లాస్టర్స్ అందుకు తగ్గట్లు దూకుడును ఎంచుకున్నాయి. మ్యాచ్ మొదలైన మొదటి నిమిషం నుంచే గోల్ లక్ష్యంగా దూసుకెళ్లాయి. ఈ క్రమంలో హెచ్ఎఫ్సీ ప్లేయర్‌ను దురుసుగా అడ్డుకున్న కేరళ డిఫెండర్ సందీప్‌సింగ్ రిఫరీ యెల్లోకార్డ్కు గురయ్యాడు. దీంతో ఇరు జట్ల ప్లేయర్ల మధ్య ఒకింత వాగ్వాదం జరుగగా, రిఫరీ నిలువరించాడు. మ్యాచ్‌లో ముఖ్యంగా కేరళ స్ట్రైకర్స్‌కు, హైదరాబాద్ డిఫెండర్ల మధ్య పోరు లాగా జరిగింది. హెచ్ఎఫ్సీ రక్షణశ్రేణిని ఛేదించేందుకు కేరళ స్ట్రైకర్లు పలుమార్లు చేసిన ప్రయత్నాలు ఎక్కడా నెరవేరలేదు. మ్యాచ్ 11వ నిమిషంలో కేరళ గోల్‌కీపర్ ప్రభ్‌సుఖన్ గిల్ షాట్ కొట్టే ప్రయత్నంలో పడిపోయి తిరిగి మైదానంలోకి వచ్చాడు. ఇలా ఒకరి గోల్‌పోస్ట్ లక్ష్యంగా ఒకరు చురుకైన దాడులకు పూనుకున్నారు.
విజేత: హైదరాబాద్ రూ.6 కోట్లు
రన్నరప్: కేరళ రూ.3 కోట్లు