వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ ఐసిస్ చీఫ్ అబూ ఇబ్రహీం అల్ హషిమీ అల్ ఖురేషీ సిరియాలో హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ‘వాయవ్య సిరియాలో అమెరికా భద్రతా బలగాలు విజయవంతంగా ఉగ్రవాద నిర్మూలన చర్యలు చేపట్టాయి. ఐసిస్ ఉగ్రవాది అబూ ఇబ్రహీం హతమయ్యాడు’ అని ప్రకటనలో పేర్కొన్నారు. సిరియాలోని అట్మే నగరంలో అబూ ఇబ్రహీం నివాసంపై అమెరికా బలగాలు బుధవారం రాత్రి దాడులు జరిపాయి. అయితే దాడుల సందర్భంగా బలగాలకు చిక్కకుండా ఉండేందుకు అబూ ఇబ్రహీం తన నివాసాన్ని బాంబులతో పేల్చేసుకున్నట్టు మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో అబూ కుటుంబ సభ్యులు కూడా మరణించారు.