న్యూఢిల్లీ : ఐఎస్ఐ ఏజెంట్, భారత్‌లో నకిలీ నోట్ల సరఫరాదారు లాల్ మహ్మద్ (55) అలియాస్ మహ్మద్‌ను నేపాల్‌లోని ఖట్మండు వద్ద సాయుధ దుండగులు కాల్చిచంపారు. లాల్ మహ్మద్ భారత్‌లో ఐఎస్ఐ నకిలీ నోట్లను పెద్ద ఎత్తున సరఫరా చేసేవాడని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనను కొందరు కెమెరాలో రికార్డు చేయడంతో వీడియో బహిర్గతమైంది.
లాల్ మహ్మద్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి నకిలీ భారత కరెన్సీని సేకరించి భారత్‌లో సరఫరా చేసేవాడు. లాల్ మహ్మద్‌కు ఐఎస్ఐ సహకరించేందని, అతడికి అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహిం డీ-గ్యాంగ్‌తో సంబంధాలున్నాయని అధికారులు తెలిపారు. ఇతర ఐఎస్ఐ ఏజెంట్లకూ అతడు ఆశ్రయం ఇచ్చేవాడని చెబుతున్నారు.
ఇక సీసీటీవీ ఫుటేజ్‌లో లాల్ మహ్మద్ ఖట్మండులోని గొటాటర్ ప్రాంతంలోని ఇంటి వెలుపల లగ్జరీ కారులో దిగుతుండటం కనిపించింది. ఆపై ఇద్దరు సాయుధ దుండగులు మహ్మద్‌పై కాల్పులు జరిపారు. లాల్ మహ్మద్ తన కారువెనుక దాక్కునేందుకు ప్రయత్నించినా దుండగులు కాల్పుల వర్షం కురిపించారు. తన తండ్రిని కాపాడేందుకు మహ్మద్ కూతురు ఇంటి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకినా అప్పటికే దుండగులు మహ్మద్‌ను మట్టుబెట్టి పరారయ్యారు.