హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): సాగునీటి పారుదల శాఖలో ఒకవైపు ముఖ్యమంత్రి పెత్తనం, మరోవైపు నీళ్ల మంత్రి ఒత్తిడి తట్టుకోలేక ఇంజినీర్లు నలిగిపోతున్నారు. వారితో వేగలేక ఓ చీఫ్ ఇంజినీర్ ఏకంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన బాటలోనే మరో ఉన్నతాధికారి కూడా సిద్ధమైనట్టు జలసౌధ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి నల్గొండ జిల్లాకు సాగునీటిని అందించే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు రూ.6190కోట్లతో పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. ఏదుల నుంచి టన్నెల్, కెనాల్ ద్వారా కృష్ణా జలాలను డిండి రివర్‌పై ఉల్పర బరాజ్‌కు 1.5 కిమీ ఎగువన నిర్మించబోయే పోతిరెడ్డిపల్లి బరాజ్‌కు, అక్కడినుంచి నల్గొండ జిల్లాకు తరలించేలా ప్రణాళికలను రూపొందించారు. మొత్తం 4 ప్యాకేజీలుగా ఈ పనులను విభజించారు. అయితే ఈ ప్రతిపాదనలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడిదే వివాదం తీవ్రమైందని తెలుస్తున్నది. ఏదుల రిజర్వాయర్ వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం 6.59 టీఎంసీలు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ 445మీటర్ల వద్ద 6.59 టీఎంసీలు, 440 మీటర్ల వద్ద 4.16 టీఎంసీలు, 437మీటర్ల వద్ద 3.04టీఎంసీలు, 436మీటర్ల వద్ద 2.72 టీఎంసీలు. అయితే ఏదుల నుంచి డిండికి, ఎగువన వట్టెం రిజర్వాయర్‌కు 436మీటర్ల నుంచే నీటికి తరలించేలా తొలుత ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ తాజాగా డిండి రివర్ బెడ్‌లెవల్ 426.37మీటర్లు ఉండగా, ఏదుల నుంచి జలాలను తరలించే బెడ్‌లెవల్ మాత్రం 421.45మీటర్లు మాత్రమే ఉన్నది. మొత్తంగా 4.9 మీటర్ల వ్యత్యాసం తక్కువ ఉన్నది. ఏదుల నుంచి జలాలను డిండికి తరలించడం అసాధ్యం.
ఈ నేపథ్యంలో ఏదుల రిజర్వాయర్ నుంచి నీటి డ్రాయల్‌ను 436 మీటర్ల నుంచి 440 మీటర్లకు పెంచాలని ఈఎన్సీ ప్రతిపాదించారు. ఏదులలో 440మీటర్లకు జలాలను చేరుకున్న తర్వాతే డిండితోపాటు, వట్టెం రిజర్వాయర్లకు జలాలను తరలించాలని ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ మేరకు గతంలో ఈఎన్సీ నివేదిక కూడా సమర్పించారు. ఈ ప్రతిపాదనల ఫలితంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఆయకట్టుపై తీవ్ర ప్రభావముంటుందని ఆందోళన వ్యక్తమవుతున్నది.
వాస్తవంగా ప్రాజెక్టు ఆయకట్టు మొత్తం వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల కిందనే ఉందని చెప్తున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా, ప్రభావాన్ని అంచనా వేయకుండా కొత్త ప్రతిపాదనలు చేయడంపై ఇంజినీర్లు గతంలోనే అభ్యంతరం చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. డిండికి ప్రత్యేకంగా పంపింగ్ ఏర్పాటు చేసుకోవాలని, ఏదుల నుంచి ఉపసంహరించుకోవాలని అక్కడి ప్రజాప్రతినిధులు సైతం డిమాండ్ చేస్తున్నారు. విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ప్రతిపాదనలు అక్కడితో నిలిచిపోయాయి కానీ పనుల కోసం మంత్రి పట్టుపడుతున్నారు. ఇప్పుడిదే వివాదానికి కారణమైంది.

సీఈపై అమాత్యుడి తీవ్ర ఆగ్రహం
డిండి ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లేందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్టుబడుతున్నారు. నల్గొండ జిల్లాకు నీరందించే లక్ష్యంతో అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. నిజానికి ఏదుల రిజర్వాయర్ నాగర్‌కర్నూల్ సీఈ పరిధిలోకి, డిండి లిఫ్ట్ నల్లగొండ సీఈ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం డిండితో పాటు ఏదుల రిజర్వాయర్ పనులను కూడా నల్లగొండ సీఈకే అప్పగించాలని గతంలో మంత్రి సన్నాహాలు చేశారు. దీనిపై నాగర్‌కర్నూల్ సర్కిల్ ఇంజినీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. డిండి పనుల పరిశీలన కోసం నాగర్‌కర్నూల్ సీఈకి కనీసం సమాచారమివ్వకుండానే, ప్రత్యేకంగా ఈఎన్సీ జనరల్‌ను క్షేత్రస్థాయికి పంపి ఏదుల సహా ఇతర ప్యాకేజీల అలైన్మెంట్లపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఏదులలో కార్యాలయం ఏర్పాటుచేయాలని నల్గొండ సర్కిల్ ఇంజినీర్లకు సైతం ఆదేశాలను జారీ చేయడం, ఆ దిశగా వారు కార్యాచరణ చేపట్టడం గతంలో వివాదానికి దారితీసింది. తాజాగా ఈ విషయమై మళ్లీ వివాదం చెలరేగి నాగర్‌కర్నూర్ సీఈపై అమాత్యుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. డిండి పనులను ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని మందలించినట్టు విశ్వసనీయ సమాచారం. మంత్రి వ్యాఖ్యలతో కలత చెందిన సదరు సీఈ రాజీనామా చేసినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే సదరు సీఈ ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతుండగా, ఇక ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించున్నారని తెలిసింది. రాజీనామా లేఖను కార్యదర్శికి సమర్పించినట్టు విశ్వసనీయ సమాచారం. అదే బాటలో సెక్రటేరియట్‌లోని మరో ఉన్నతాధికారి కూడా ఇంటిబాట పట్టేందుకు సిద్ధమయ్యారని, కానీ అధికారులు నచ్చజెప్పడంతో వెనక్కి తగ్గారని తెలుస్తున్నది.
నలిగిపోతున్న ఇంజినీర్లు
ఇరిగేషన్ శాఖలో సీఎం అనుయాయులు, పైరవీతో వచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది. ప్రభుత్వ సలహాదారు మొదలు కిందిస్థాయి వరకు కీలక విభాగాల్లో వారి పెత్తనమే సాగుతున్నదని జలసౌధవర్గాలు నొక్కిచెబుతున్నాయి. ఇటీవల బదిలీల సందర్భంగా ఉన్నతాధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. పారదర్శకత పాటించాలని, ఏ విభాగం ఇంజినీర్లను ఆ విభాగానికే బదిలీ చేయాలని స్పష్టంగా చెప్పినా, ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగానే పలు బదిలీలు జరిగాయి.
సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాలనే క్షేత్రస్థాయిలో అమలుచేశారని తెలుస్తున్నది. ఓ మంత్రి తనకు అత్యంత సన్నిహితుడైన ఇంజినీర్‌ను తీసుకొచ్చి బదిలీల నుంచి మినహాయించాలని ఆ శాఖ అమాత్యుడిని కోరారని, కానీ అందుకు ఆయన నిరాకరించారని, కానీ అదే మంత్రి తిరిగి సీఎంవో నుంచి చెప్పించుకోవడం, సదరు ఇంజినీరును యథావిధిగా అక్కడే కొనసాగించడం శాఖలో పరిస్థితికి అద్దం పడుతున్నది. బిల్లుల చెల్లింపుల్లోనూ సీఎంవోదే పెత్తనమని జలసౌధ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాంట్రాక్టు ఔట్సోర్సింగ్, హైర్ వెహికిల్స్ బిల్లులను కూడా విడుదల చేయడం లేదు. గతంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే.
ఆ పర్యటనను సైతం ముఖ్యమంత్రే సొంతంగా ఖరారు చేసుకున్నారని తెలుస్తున్నది. ఇరిగేషన్‌శాఖలో తన అనుయాయులైన ఇంజినీర్లను ముందుగానే పిలిపించుకొని ప్రాజెక్టు సందర్శనకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారని సమాచారం. ఆ తర్వాత అధికారులు టూర్ షెడ్యూల్‌ను ఖరారు చేశారని తెలిసింది. ముఖ్యమంత్రి వ్యవహారంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలుస్తున్నది. అంతేకాదు ప్రాధాన్యత క్రమంలో పలు ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, వాటికి సైతం ఒక్క రూపాయి ప్రభుత్వం విడుదల చేయడం లేదు. వెరసి ఆ ప్రాజెక్టుల పనులన్నీ ఎక్కడికక్కడ పడకేశాయి. ముఖ్యమంత్రిపై ఉన్న ఆగ్రహాన్ని ఇంజినీర్లపై వ్యక్తం చేయడం పరిపాటిగా మారిందని చర్చ కొనసాగుతున్నది. వెరసి సీఎం, మంత్రి మధ్య మాత్రం ఇంజినీర్లు నలిగిపోతున్నారు.