Mahan Air Craft : ఇరాన్ (Iran) నుంచి భారత్ (India) కు రావాల్సిన పౌర విమానంపై దాడి జరిగింది. భారత్ నుంచి మెడిసిన్, వైద్య సామాగ్రిని తరలించాల్సిన విమానంపై అమెరికా (USA) నే దాడి చేసిందని భారత్‌లోని ఇరాన్ ఎంబసీ (Iran Embassy) ఆరోపించింది. ఈ ఘటనను యుద్ధ చర్యగా అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా ఇరాన్ రాయబార కార్యాలయం విరుచుకుపడింది.
పలు దేశాల నుంచి ఇరాన్‌కు మందులు, వైద్య పరికరాలను రవాణా చేస్తూ మషద్ విమానాశ్రయంలో దిగిన పౌర విమానంపై అమెరికా-ఇజ్రాయెల్ దాడికి పాల్పడ్డాయని ఇరాన్ ఆరోపించింది. ఈ దాడిలో విమానం దెబ్బతిన్నట్లు తెలిపింది. దీన్ని ఇరాన్ పౌర విమానయాన శాఖ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంబసీ పేర్కొన్నది. మానవతా సాయాన్ని తరలించే పౌర విమానాలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని చెప్పింది.
ఇది యుద్ధచర్యేనని, దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై విచారణ జరపాలని అంతర్జాతీయ సంస్థలకు పిలుపునిచ్చింది. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ప్రజల కోసం భారత్ మానవతా సాయం చేస్తున్నది. అందులోభాగంగానే మహాన్ ఎయిర్‌కు చెందిన విమానం మందులు, వైద్య సామగ్రిని తీసుకెళ్లేందుకు ఈ వారంలో భారత్‌కు రావాల్సిఉంది. ఈ క్రమంలోనే అది మషద్ విమానాశ్రయంలో ఉండగా దాడి జరిగింది.
తాజా ఘటన నేపథ్యంలో ఇరాన్‌కు అందే సహాయక చర్యలకు అంతరాయం కలుగనుంది. అయితే ఈ దాడికి సంబంధించి అమెరికా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.