హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ)/వరంగల్: దేశంలోని మీడియాలో పరిశోధనాత్మక పాత్రికేయం అంతరిస్తున్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తంచేశారు. సమాజానికి మేలుచేసే కథనాలు ప్రస్తుత మీడియాలో అరుదుగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్‌రెడ్డి రచించిన ‘బ్లడ్ శాండర్స్’ పుస్తకావిష్కరణ సభలో బుధవారం జస్టిస్ రమణ వర్చువల్‌గా ప్రసంగించారు. ‘ప్రస్తుత మీడియా గురించి కొంచం స్వేచ్ఛ తీసుకొని మాట్లాడాలనుకొంటున్నాను.
దురదృష్టవశాత్తూ భారత మీడియా రంగంలో పరిశోధనాత్మక పాత్రికేయం అంతరిస్తున్నది. భారతీయ దృక్కోణంలో ఇది ముమ్మాటికీ నిజం. మా చిన్నతనంలో కుంభకోణాలను బయటపెట్టే సంచలనాత్మక మీడియా కథనాల కోసం ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లం. మీడియా కూడా మమ్మల్ని నిరుత్సాహపర్చకుండా అలాంటి మంచి కథనాలు ప్రచురించేది. అలాంటి కథనాలను ఈ మధ్య ఒకటీ అరా తప్ప పెద్దగా నేను చూడలేదు. వ్యవస్థలోని లోపాలను మీడియా ఎత్తిచూపి ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉన్నది’ అని పేర్కొన్నారు.
గిరిజనుల సహకారంతో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట
శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టే ప్రయత్నాల్లో స్థానిక గిరిజనులను భాగస్వాములను చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. గిరిజనులను ఫారెస్ట్ గార్డులుగా నియమించాలని సూచించారు. ఇప్పటికే ఈ విధానం పులుల సంరక్షణలో విజయవంతమైందని గుర్తుచేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉడుముల సుధాకర్‌రెడ్డి ఎన్నో కష్టాలకోర్చి బ్లడ్ శాండర్స్ పుస్తకాన్ని రచించారని ప్రశంసించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ ఎంవీ కృష్ణారావు, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ రఘువీర్, కేంద్ర మాజీ సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
18న వరంగల్‌కు సీజేఐ
అత్యాధునిక హంగులతో సిద్ధమైన వరంగల్ కోర్టుల భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 19న ప్రారంభించనున్నారు. వరంగల్ జిల్లా న్యాయమూర్తి నందికొడ నర్సింగరావు, పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో సీజేఐ పర్యటన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. జస్టిస్ రమణ ఈ నెల 18న వరంగల్‌కు చేరుకొంటారు. అదేరోజు మధ్యాహ్నం ములుగు జిల్లాలోని చారిత్రక రామప్ప ఆలయంలో పూజలు చేస్తారు. 19న ఉద యం వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొంటారు. అనంతరం కోర్టుల కొత్త భవనాన్ని ప్రారంభిస్తారు. కోర్టుల సముదాయాన్ని రాష్ట్రప్రభుత్వం రూ.21.65 కోట్లతో 1.23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించింది.