వజ్రోత్సవ భారతికి సాహితీ నీరాజనం
వజ్రోత్సవ భారతావనికి ‘చెలిమె’ అందిస్తున్న సాహితీ నీరాజనం ఇది. ‘నమస్తే తెలంగాణ’ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన వచ్చింది. అనేక మంది కవితలు రాసి స్వాతంత్య్రోద్యమ విలువలపై తమ మమకారాన్ని చాటుకున్నారు. వారందరికీ కృతజ్ఞతలు
వజ్రోత్సవ భారతావనికి ‘చెలిమె’ అందిస్తున్న సాహితీ నీరాజనం ఇది. ‘నమస్తే తెలంగాణ’ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన వచ్చింది. అనేక మంది కవితలు రాసి స్వాతంత్య్రోద్యమ విలువలపై తమ మమకారాన్ని చాటుకున్నారు. వారందరికీ కృతజ్ఞతలు. – చెలిమె
అఖండ తేజం నా మేటి భారతం
సకల సంస్కృతుల సదనం
సర్వమత సమభావ సన్నిధం
సత్యం ధర్మం శాంతి సమ్మిళితం
స్వేచ్ఛ స్వాతంత్య్రాల సమాహారం
సుప్రసిద్ధం నా భారత దివ్యచరితం
త్రివేణి సంగమ ఉత్తేజితం
ప్రకృతి, వనహరిత శోభితం
హిమవత్పర్వత గాంభీర్యం
సుజల సుఫల సస్య సుక్షేత్రం
విశ్వవిఖ్యాతం నా భవ్య భారతం
అద్భుత రాజ్యాంగం
అద్వితీయ గణతంత్రం
అపూర్వ ప్రజాస్వామ్యం
అశేష జనజీవన ప్రభాతం
అఖండ తేజం నా మేటిభారతం
అమరవీరుల త్యాగ సంతకం
సమరధీరుల పౌరుష సంకేతం
మహనీయుల శాంతి సందేశం
మహాత్ములు నడయాడిన దేశం
జగత్ప్రశస్త్యం నా మేధో భారతం
ఈ శుభప్రద దినముల
వినీల ఆకాశం నిండేలా
మువ్వన్నెల జెండా ఎగరేద్దాం
అష్టదిక్కులు ప్రతిధ్వనించేలా
జనగణమన గీతం పల్లవిద్దాం
భువనతలం ప్రభవించేలా
దేశ మాతకు హారతి పడదాం
జగతి అచ్చెరువొందేలా
వజ్రోత్సవ ద్వి సప్తాహం
దిగ్విజయవంతం గావిద్దాం
జయహో భారత జనయిత్రి
జయ విజయహో దివ్యదాత్రి
– కోడిగూటి తిరుపతి, 95739 29493
ఘన వజ్రోత్సవ వేళ దేశ జనతా గర్వమ్ము పర్వమ్ముగా
చేతన కేతనమ్మున కశేష నమస్కృతులంద జేయగా
జాతి విశాల దేశమున జాగృతితో సమకూడె నేడు, ఈ
భూతలమందు పావన విభూతుల నింపిన భారతావనిన్
నూతన శోభ వెల్లువలు నోముల పంటల వోలె భాసిలెన్!
ఘన వజ్రోత్సవ వేళ దేశ జనతా గర్వమ్ము పర్వమ్ముగా
ననయమ్మెల్లెడ తారకాసదృశమై యందాలతో గన్పడన్
మనముల్ మానస హంసలై విహరణన్ మాతృ ప్రభాహేలలన్
గొని విశ్వమ్మున సంచరించె సమతన్ గూర్పంగ నుల్లాసతన్!
భారత వీరగాథలకు భాసురమైన మహోద్యమమ్ములో
ధారగ సాగినట్టి జనతా ప్రచురోద్ధత కంఠనాదముల్
తీరుగ నేటిదాక వినదీరుచునున్నవి, వాని స్ఫూర్తితో
పోరును సల్పగా వలె నభోంతర సీమల దాక చేతనన్!
స్వాతంత్య్రామృతపాన వర్ధితముగా భద్రస్థితిన్ దేశమే
కాతంత్రమ్ముల పారదోలినది సంకాశింపగా స్వేచ్ఛతో
ధీతంత్రమ్ముల విజ్ఞతల్ విరియగా తేజోనిధుల్ నిల్చె, నీ
స్వాతంత్య్రమ్మొక కీర్తి కాంతి కలితస్వారాజ్యమై వెల్గగన్!
జాతి పురోగమించవలె, చక్కనిదారుల నింగి లక్ష్యమై
నీతిని నిల్పగావలె ననేక చరిత్రల వ్రాయబోవగా
ఖ్యాతి చరింపగా వలె వికాస మయోన్నతి విశ్వవీధిలో
ప్రీతిగ దీర్పగా వలె వరేణ్య సదాశయ భావనమ్ములన్!
– డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ, 94404 68557
అమృతమూర్తులు ముగ్గురమ్మలు
మన దేశం మన తల్లి!
మన ఊరు మన తల్లి!
మనల కన్న మన తల్లి!
ముగ్గురమ్మలకు వందనం!
పౌరులమైనందుకు ఆనందం!
దేశభక్తి పెల్లుబుకిన సందర్భం!
త్యాగాలు పారించిన రక్తాలు!
బలిదానాలు తెచ్చిన స్వాతంత్య్రాలు!
అమృతం పంచిన ఆత్మార్పణలు!
అమృతమూర్తులు ముగ్గురమ్మలు!
సహనశాంతీ ప్రేమల గుర్తులు!
వజ్ర సంకల్పంతో ప్రణమిల్లుదాం..
జయహో! నా దేశ మాతా!
కనుమా గగనవీధుల మన పతాకా!
వినుమా విజయోత్సవ గీతికా!
– అనిశెట్టి రజిత

పోరుబందరు పోరుబిడ్డ
పోరుబందర్లో పుట్టినావు..
పోరుబాట పట్టినావు..
జాతీయోద్యమంతో జాతిని జాగృతం చేసినావు..
అంగవస్త్రముతో అందరికీ ఆదర్శమై నిలిచినావు
తెల్లవారి నల్ల మనస్తత్వాన్ని నిగ్గదీసి నిలబెట్టినావు..
‘సత్యం అహింసా’ సిద్ధాంతాలతో
ప్రపంచ ఉద్యమాలకు ఉగ్గుపాలు పోసినావు…
జాతి జనులందరిని గిరిగీసి బరిలో నిలబెట్టినావు..
పరాయి పాలనపై పాంచజన్యం పూరించినావు..
గాంధేయవాదమే గాండీవమై పరాయి పాలనపై ఎక్కువ పెట్టినావు..
‘చంపారన్ సత్యాగ్రహం’తో నీలిమందు రైతులను ఏకం జేసినావు…
‘సహాయ నిరాకరణ’ ఉద్యమంతో
తెల్లవారి గుండెల్లో గునపాలు దింపినావు..
‘దండియాత్ర’ దండయాత్రగా మలచి..
‘ఉప్పు చట్టాలకు’ ఉప్పు పాతర పెట్టినావు..
‘స్వపరిపాలన’ కోసం తెల్లవారిపై సమరశంఖం పూరించినావు..
‘క్విట్ ఇండియా’ ఉద్యమంతో పరాయి పాలనకు తెరదించినావు
చివరి వరకు భరతమాత ‘స్వేచ్ఛ’ కొరకు పరితపించినావు..
సర్వం దేశం కోసం త్యాగం చేసినావు..
కడకు ఓ మతోన్మాది తూటాకు నేలకొరిగినావు..
‘బాపూజీగా మహాత్ముడిగా జాతిపితగా’ పేరు పొందినావు..
అనన్యం అజరామరం..
నీ పోరాట స్ఫూర్తితో..,
భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచినావు..
పోరుబందర్లో పుట్టినావు…
పోరుబాట పట్టినావు…
– డాక్టర్ మహమ్మద్ హసన్, 99080 59234
స్వాతంత్య్ర సమర జ్వాలిక
పల్లవి: స్వాతంత్ర సమర జ్వాలికా
రిపు దండ నిర్దళన కాళికా
పరదాస్య పీడన పరివేదనను తీర్చ
రణ నినాదము చేసె అపర రుద్రాలికా
అదిగో ఝాన్సీ లక్ష్మీబాయీ
ఆంగ్లేయులకు ఆమె సింహ స్వప్నమ్మోయి-2
చరణం: చిన్ననాడే చేత పూనింది ఖడ్గమూ
గుర్రమెక్కీ బిగియ పట్టింది కళ్ళెమూ
అగ్నికీలల తీరు ఎగిసేటి కురులతో
గాలినీ చీల్చుకొని సాగేటి వేగమూ
కాకతీ రుద్రమను తలపించు వీరమూ
మణికర్ణికా దేవి మహిళా రత్నమూ
ఆమె ఝాన్సీ లక్ష్మీబాయీ
చండ్ర నిప్పులు చిమ్ము ఆమె కనుదోయి- 2
చరణం: కుంఫిణీ దొరగాడు కుటిలమతి డల్హౌసీ
రాజ్య సంక్రమణ సిద్ధాంతమును ప్రకటించి
పుత్ర సంతతి లేని సామంతరాజులా
రాజ్యాల కబళించె పథకమే పన్నిండు
కంపెనీ పెత్తనము కాటికీ పంపించ
రాజలోకమ్మొక్కటాయే-
సిపాయీలు సైతం సిద్ధమాయే- 2
చరణం: అరెరే సిపాయీలా తిరుగుబాటూ
ఆంగ్లేయ కంపెనీకి అది గుండెపోటు
అరెరే సిపాయీలా తిరుగుబాటు
ఆంగిలేయులా గుండెల్లో గునపాల పోటు
చరణం: దత్తపుత్రుని తన మూపునా గట్టుకొని
అగ్గిపిడుగై అమ్మ యుద్ధమున దూకింది
శివశక్తి దళమోలె అంగరక్షణ సేన
హరహరా హరయంచు రణ గర్జనలు సేయ
అరి భయంకర లీల ఆమె చెలరేగింది
చరణం: దెబ్బకొక తల తెంచి నేలబడ కూల్చింది
శత్రువుల రక్తముతో స్నానమే చేసింది
విష్ణుచక్రము తీరు విక్రమించెను రాణి
చరణం: కొట్టలేక, ఒడిసి పట్టలేక
ఆంగ్లేయ సైన్యమూ హడలెత్తిపోయిందీ
ఆమె ఝాన్సీ లక్ష్మీబాయీ
ఆమె కత్తికి ఎదురు లేనే లేదోయీ- 2
చరణం: యుద్ధరంగము నడుమ సోన్ రేఖ నది ఉంది
నాడు ఆ నదిలో రక్తమే పారింది
(నదికి ఈ వైపునా రాణి పోరాటమూ
నదికి ఆ వైపునా అంగరక్షక దళము)
ఏరు లంఘించుటకు హడలింది అశ్వమూ
ఝాన్సీరాణిని చుట్టుముట్టింది సైన్యమూ
అదను చూసీ దొరలు వేసిన్రు వేటు
రాణి తలపై పడెను తెల్లనాగుల కాటు
అస్తమించెను వీర నారీ
అమర చరితగా నిలిచింది ఆ ఖడ్గధారీ
ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి
స్త్రీ శక్తికీ ఆమె పర్యాయపదమోయి.
– దేశపతి శ్రీనివాస్
రంగుల ముచ్చట
రంగులు మూడైన
దేశం ముచ్చటనే
ధర్మచక్రం ఊరక ఉండదు
అధర్మాన్ని ఊచకోత కోస్తుంది
మేడిపండు మేధావుల
మేకపోతు గాంభీర్యాన్ని
తెల్లని కాగితం మీద
నల్లని సిరా పోస్తుంది
రాజీపడే జీవుల ఆత్మధైర్యాన్ని
పోరాటం వైపు మళ్లిస్తుంది
మట్టి తిరుగుబాటు చేస్తే
చావుకు చోటు కూడ దొరకదు
రంగుల ముచ్చట మరిచిపోకు
దాస్య జీవనం గడప బోకు
వెలుగు పూలజాతరలో
తెల్ల పులుగుల స్వేచ్ఛా గగన విహారం
నేలతో నీటితో పచ్చనిదారుల్లో
నడిచె నవతరంగం
విజ్ఞానంతో నూతన ఆవిష్కరణలతో
కాషాయదారుల్లోన నడిచే
ఖడ్గవిన్యాస దరహాసం
పురోగమన పతాక రెపరెపలు
రక్తంతో తడిసిన ఎర్రెర్రని రక్త సింధూరం
రంగుల ముచ్చట
బండరాయివి కావు నీవు
బడబాగ్నివి అని నినదించు
నడుస్తూ పో
నీ అడుగుల వెంట మరొకరు
– రేడియమ్
92915 27757

వీరుల త్యాగఫలం
భారతం భారతం స్వాతంత్ర భారతం..!
ఘనత గన్న, చరిత ఉన్న స్వేచ్ఛా భారతం..!
ఎందరో అమరుల త్యాగ భారతం..!
అల్లూరి తెలుగు శౌర్య జ్వాలన భారతం..!
గాంధీజీ సాధించిన స్వరాజ్య భారతం..!
అంబేద్కర్ ఆశించిన సౌమ్య భారతం..!
భిన్నజాతి సంస్కృతులకు కూడికగా..!
వేష భాషలెన్నింటికో వేదికగా..
డబ్బు ఐదేండ్ల స్వతంత్ర భారతానికి గౌరవం..!
పలు ప్రపంచదేశాల హర్షధ్వానాల పర్వం..!
స్వాతంత్య్ర ఫలాన్ని పొందిన సమైక్య భారతీయులం..!
వీధి వీధిన రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం..!
వజ్రోత్సవాలతో స్వాగతం పలుకగా..!
గుండెల నిండా దేశభక్తితో వందేమాతరం
అని స్వాతంత్య్ర వేడుకలు..!
‘జై హింద్’ అంటూ నలుదిక్కుల
భారతీయుని కంఠం ప్రతిధ్వనిస్తుంది..!
తిరుగుబాటు చేసి తిరోగమనం జేయించి
పోరులో నడిచిన ప్రతి ఒక్కరికీ..!
వెన్ను తట్టి నడిపిన మహనీయులకు..!
శత సహస్ర వందనాలు పెడదాం..!
– తుమ్మల కల్పన రెడ్డి, 96404 62142

ఎగిరేద్దాం మువ్వన్నెల జెండా
పల్లవి: ముచ్చటగా ఎగిరేద్దాం.. మువ్వన్నెల మన జెండా
వజ్రోత్సవ ప్రస్థానం.. సంబరాలు జనం నిండా
॥ముచ్చట॥
చరణం: గాంధీ నెహ్రూ బోసు బాబు.. భగత్సింగులెందరో
స్వరాజ్య సమరపోరు.. త్యాగధనులు ఎందరో
దేశ దాస్య శృంఖలాలు.. తెంచినట్టి ధన్యులు
వారి చరిత వారి ఘనత.. రెపరెపలా మన జెండా
॥ముచ్చట॥
చరణం: స్వాతంత్య్ర స్వేచ్ఛ మనకు.. సాధించిన వారి కీర్తి
శాంతి సమరశీలాల.. పరిమళాల వారి స్ఫూర్తి
అందరికీ అభివృద్ధి.. అందాలనే వారి ఆర్తి
ఆశయాల పరిపూర్తి.. అమలవుతూ సాగాలని
॥ముచ్చట॥
పల్లవి: సార్వభౌమ సామ్యవాద.. లౌకిక గణతంత్రం
రాజ్యాంగం మనకిచ్చిన.. రాజనీతి మంత్రం
ప్రజాస్వామ్య సూక్తులు.. ప్రాథమిక హక్కులు
ప్రజలందరికందాలనె.. ప్రగతి గొంతు వినిపిస్తూ
॥ముచ్చట॥
పల్లవి: దేశభక్తి అంటేనే.. దేశం ప్రేమించడమని
జాతీయ భావమంటే.. జనం ఐక్యపర్చడమని
సమైక్యత సమభావం.. గుండెల్లో నింపడమని
జనజాగృత చైతన్యం.. జననాదం కావాలని ॥ముచ్చట॥
పల్లవి: మతం కులం ఏదైనా.. మానవతే ప్రజాహితం
మనమంతా ఒకటేననే.. మహనీయుల అభిమతం
మరవకుండా వెరవకుండా.. మరోసారి జాతినిండా
మహోజ్వల మన ఖ్యాతి.. మహోదయం నిండాలని
॥ముచ్చట॥
రంగురంగు పూల లాగ.. రాష్ర్టాల మణిహారం
సంస్కృతి వైవిధ్యనదుల.. సమ్మేళన మహా సాగరం
మలయ మారుతాల నిలయ.. మహోజ్వల మాతృభూమి
సమగ్రత చిరకాంతులు.. కలకాలం వెలగాలని
॥ముచ్చట॥
– వేల్పుల నారాయణ
94404 33475

ఇంటింటా జాతీయ జెండా
బానిస సంకెళ్లను భరతమాత తెంచుకుంది!
వీర పుత్రులను కన్నతల్లి విజయ తిలకాన్ని దిద్దుకుంది!
వీరగాథల పర్వము విజయాన్ని సాధించింది!
బలిదానాల సాక్షిగా విజయకేతనం ఎగురుతుంది!
ముచ్చటైన మువ్వన్నెల జెండా నీలి
ఆకాశం అంచులను తాకింది!
నేల మీది మట్టంతా పసిడి మాగాణమై పలకరించింది!
దేశ ప్రజల దృఢ సంకల్పం నాడు ఆంగ్లేయులను ఓడించింది!
తెల్లదొరల పెత్తనమంతా మట్టి కొట్టుకు పోయింది!
తోక ముడ్చిన అధికారం తెల్లముఖం వేసింది!
మహాత్ముని అహింసావాదం దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చింది!
అణువణువున నిండిన దేశభక్తి ఇంటింటా పలకరిస్తుంది!
వజ్రోత్సవ వేడుకల రూపంలో నేడు మన దేశం
ముక్త కంఠంతో జాతీయ గీతాన్ని ఆలపిస్తుంది!!
– ఎస్.జవేరియా, 98499 31255
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?


