ఆసియా క్రీడల రెండో రోజూ భారత షూటర్ల పతక గురి తప్పలేదు. తొలిరోజు మహిళా షూటర్లు ఇచ్చిన స్ఫూర్తితో పురుషుల పది మీటర్ల ఎయిర్‌రైఫిల్ ఈవెంట్ వ్యక్తిగత విభాగాల్లో హిమాన్షు, రుద్రాంక్ష్ దేశానికి ఈ క్రీడల్లో తొలిసారి ‘డబుల్ పోడియం’ అందించారు. ఆ తర్వాత పార్థ్‌తో కలిసి టీమ్ ఈవెంట్లోనూ వెండి వెలుగులు పంచారు. ఈ గేమ్స్‌లో అరంగేట్ర క్రీడ అయిన ఎంఎంఏలో భారత ఫైటర్ సుచిక రిఫరీల ‘వివాదాస్పద నిర్ణయం’ కారణంగా కాంస్యంతోసరిపెట్టుకోగా హాకీ, కబడ్డీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్‌లో భారత క్రీడాకారులు ముందంజ వేశారు.
నగోయా: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో తొలిరోజే భారత్‌కు ‘డబుల్ ధమాకా’ అందించిన షూటింగ్లో రెండో రోజూ మూడు పతకాలు దక్కాయి. సోమవారం జరిగిన పురుషుల పది మీటర్ల ఎయిర్‌రైఫిల్ ఈవెంట్లో యువ షూటర్లు హిమాన్షు ధిల్లాన్, రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్ వ్యక్తిగత విభాగాల్లో రజతం, కాంస్యంతో సత్తాచాటారు. ఈ ద్వయం మరో యువ సంచలనం పార్థ్ మానెతో కలిసి టీమ్ ఈవెంట్లోనూ సిల్వర్ సాధించి దేశానికి ఒకేరోజు మూడు పతకాలను అందించింది. సోమవారం 21వ పుట్టినరోజు జరుపుకున్న హిమాన్షు.. ఈ పోటీల ఇండివిడ్యూవల్ ఈవెంట్ ఫైనల్లో 252.4 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంతో సిల్వర్ నెగ్గితే, రుద్రాంక్ష్ 230.9 స్కోరుతో కంచు మోత మోగించాడు.
చైనాకు చెందిన షెంగ్ లిహావొ 254.2 పాయింట్లతో స్వర్ణం సాధించడమే గాక ఆసియా గేమ్స్ రికార్డునూ నమోదుచేయడం విశేషం. క్వాలిఫికేషన్ రౌండ్లో రుద్రాంక్ష్ మూడో స్థానంతో ముగించగా హిమాన్షు 7వ ప్లేస్‌తో ఫైనల్ చేరాడు. తొలిసారి ఆసియా గేమ్స్ ఆడుతున్న ఈ హర్యానా కుర్రాడి కంటే ముందే రుద్రాంక్ష్.. షెంగ్‌కు గట్టిపోటీనిచ్చాడు. ఫస్ట్ సిరీస్‌లో అతడు (106) షెంగ్ కంటే 1.1 పాయింట్ల ఆధిక్యంలో ఉండగా హిమాన్షు (104.8) మూడో స్థానానికి పరిమితమయ్యాడు. కానీ రెండో సిరీస్ తర్వాత చైనా షూటర్ పుంజుకున్నాడు. ఇక ఎలిమినేటెడ్ సిరీస్ నుంచి రుద్రాంక్ష్ క్రమంగా వెనక్కి వెళ్లాడు. 22, 24వ షాట్ తర్వాత హిమాన్షు.. రుద్రాంక్ష్ను అధిగమించి రజతాన్ని ముద్దాడాడు.
ఇండివిడ్యూవల్ ఈవెంట్లో రాణించిన హిమాన్షు, రుద్రాంక్ష్.. టీమ్ ఈవెంట్లో 18 ఏండ్ల సోలాపూర్ కుర్రాడు పార్థ్‌తో జతకట్టారు. తుదిపోరులో ఈ భారత త్రయం.. 1890.1 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సాధించింది. హిమాన్షు, రుద్రాంక్ష్ ‘డబుల్ సిల్వర్’ సాధించడం గమనార్హం. చైనా షూటర్లు షెంగ్, చాంగొంగ్ ఝాంగ్, సిహాన్ 1899 పాయింట్లతో ప్రపంచ రికార్డును నెలకొల్పి పసిడి పతకాన్ని గెలుచుకున్నారు. కొరియా (1884.2)కు కాంస్యం దక్కింది. షూటింగ్లో నాలుగు రజతాలు, ఒక కాంస్యంతో ఇప్పటికే ఐదు పతకాలు సాధించగా ఎంఎంఏతో కలుపుకుని మొత్తంగా భారత్ ఖాతాలో ఆరు పతకాలున్నాయి.
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ)లో భారత ఫైటర్ సుచిక తరియల్ కాంస్య పతకం సాధించింది. ‘బరువు’ నిబంధన ఆమెను పసిడి పోరుకు చేరుకోకుండా అడ్డుకుంది. మహిళల 60 కిలోల విభాగంలో సెమీఫైనల్స్ ఆడిన సుచిక.. సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియోతో పోరును రిఫరీలు డ్రాగా తేల్చారు. మూడు బౌట్లపాటు సాగిన పోరులో ఈ ఇద్దరూ తలా ఒక రౌండ్ గెలుచుకున్న తర్వాత కీలకమైన మూడో బౌట్‌లోనే అసలు వివాదం రాజుకుంది. ముగ్గురు న్యాయ నిర్ణేతలు ఇద్దరికీ 19 పాయింట్లే ఇచ్చారు.

దీంతో ఆ తర్వాత విజేతను తేల్చేందుకు నిర్వహించిన టై (ఒక నిమిషం పాటు)లోనూ ఇరువురికీ 10 పాయింట్లే వచ్చాయి. అయితే సింగపూర్ ఫైటర్‌ను విజేతగా తేల్చడంతో సుచిక, భారత ప్రతినిధులు ఈ ఫలితంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో ఆటలోని నిబంధనల మేరకు బౌట్‌కు ముందు ప్లేయర్ల బరువు (ఎవరు తక్కువగా ఉంటే వారు విజేత)ను బట్టి విన్నర్‌ను నిర్ణయించారు. దాని ప్రకారం సుచిక 59.2 కిలోల బరువుండగా హుయ్ హూన్ 58.5 కిలోలు ఉంది. 700 గ్రాముల తక్కువ బరువుతో సింగపూర్ ప్లేయర్ ఫైనల్ చేరింది.
బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల జట్టు.. అమ్మాయిల మాదిరిగానే క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. సోమవారం ఏకపక్షంగా సాగిన తొలి పోరులో లక్ష్యసేన్, అయూశ్ శెట్టి, కిదాంబి శ్రీకాంత్‌తో కూడిన భారత్.. 3-0తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. మొదట లక్ష్య 21-14, 21-12తో ఐమన్ జమన్పై గెలువగా రెండో సింగిల్స్‌లో అయూశ్ 21-4, 21-13తో గౌరవ్ సింగ్‌పై అలవోక విజయం సాధించాడు. థర్డ్ సింగిల్‌లో శ్రీకాంత్ 21-15, 21-9తో జుమర్ అల్ అమిన్పై 23 నిమిషాల్లోనే గెలిచి క్వార్టర్స్ బెర్తు ఖాయం చేశాడు.

భారత మహిళల హాకీ జట్టు తొలి మ్యాచ్ జోష్‌నే కొనసాగించింది. ఉజ్బెకిస్థాన్ 19-0తో చిత్తుచేసిన భారత్.. సోమవారం జరిగిన పూల్-బీ రెండో మ్యాచ్‌లో 17-1తో ఇండోనేషియానూ మట్టికరిపించింది. తొలి పోరులో 8 గోల్స్‌తో రెచ్చిపోయిన యువ సంచలనం దీపికా సెహ్రావత్ ఈ మ్యాచ్‌లోనూ హ్యాట్రిక్ (8, 28, 40వ నిమిషాల్లో) గోల్స్‌తో సత్తాచాటింది. ఆమెతో పాటు రుతుజ (15, 20, 38వ), నవ్‌నీత్ (35, 56, 57వ) సైతం హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టారు. ఈ త్రయంతో పాటు సునెలిత (11, 30వ), లాల్రెమ్సియామి (12, 16వ), సాక్షి రాణా (25, 57వ) తలా రెండు గోల్స్ చేయగా సారథి సలీమ టెటె (35), ఇషికా (36) ఒక గోల్ చేశారు.

బాక్సింగ్‌లో భారత ప్రయాణం విజయంతో ఆరంభమైంది. పురుషుల 70 కిలోల విభాగంలో పోటీపడ్డ సుమిత్ కుందు.. 5-0తో థాయ్‌లాండ్‌కు చెందిన బున్జొంగ్ సిన్సిరిపై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరాడు. వుషూ పురుషుల 56 కేజీల కేటగిరీలో తొలిసారి ఆసియా గేమ్స్ ఆడుతున్న ఆర్యన్.. 2-0తో సఫీ షెహజదా (అఫ్గానిస్థాన్)పై విజయం సాధించగా విమెన్స్ కేటగిరీ 60 కిలోల ప్రిక్వార్టర్స్‌లో రొషిబినా దేవి.. శిఖా ఖటూన్పై గెలిచి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. స్విమ్మింగ్‌లో శ్రీహరి నట్రాజ్ పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో ముందంజ వేయగా రిషభ్ దాస్, ఆకాశ్ మణి, జితేశ్ షా, ధనుశ్ నిరాశపరిచారు. సెపక్ తక్రా, సాఫ్ట్ టెన్నిస్‌లోనూ భారత్‌కు నిరాశజనక ఫలితాలు వచ్చాయి.

టేబుల్ టెన్నిస్‌లో భారత పురుషుల, మహిళల జట్లు తాము ఆడిన గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించాయి. గ్రూప్-ఎఫ్‌లో మొదట అమ్మాయిల జట్టు 3-0తో పాక్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. సుతీర్థ 11-3, 11-3, 11-4తో అలీనా ఖాన్‌ను ఓడిస్తే రెండో సింగిల్స్‌లో సిండ్రెల్లా దాస్ 11-6, 11-7, 11-5తో కల్సూమ్ ఖాన్‌పై ఈజీగా నెగ్గింది. మూడో సింగిల్స్‌లో ఆకుల శ్రీజ 11-4, 11-4, 11-5తో ఫాతిమా ఖాన్‌ను ఇంటికి పంపించి లాంఛనాన్ని పూర్తిచేసింది. పురుషుల విభాగంలోనూ హర్మీత్ దేశాయ్, సతియాన్, పయాస్ జైన్ తమ ప్రత్యర్థులపై సునాయాస విజయాలతో దాయాదిని స్వీప్ చేశారు.
కబడ్డీలో డిఫెండింగ్ చాంపియన్లుగా టోర్నీని ఆరంభించిన భారత జట్లు శుభారంభం చేశాయి. తొలుత గ్రూప్-ఏలో పురుషుల జట్టు 49-24తో జపాన్ను ఓడించి ఈ క్రీడల్లో ఆ జట్టుపై ఓడిపోని రికార్డును కొనసాగించింది. మహిళల జట్టు 42-21తో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.
