భారతీయ డాక్యుమెంటరీ చిత్రం ‘రైటింగ్ విత్ ఫైర్’ ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాల పోటీలో నిలిచింది. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో తుది పదిహేను సినిమాల జాబితాలో ఈ చిత్రం చోటు దక్కించుకున్నది. దేశంలో దళిత మహిళలు నిర్వహిస్తున్న ఏకైక వార్త పత్రిక ఖబర్ లహరియా నేపథ్యంలో వాస్తవ ఘటనల స్ఫూర్తితో సుష్మితఘోష్, రింటు థామస్ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు.
సమాజంలోని కుల వివక్ష, పురుషాధిక్యతను ఎదుర్కొంటూ పాత్రికేయ వృత్తిలో కొందరు మహిళలు ఎలా రాణించారు? ఆధునిక సాంకేతికతలో ప్రావీణ్యంలేని వారు డిజిటల్ మీడియాలో ఎలా ప్రతిభను చాటుకున్నారో స్ఫూర్తిదాయకంగా ఇందులో ఆవిష్కరించారు. సునీతా ప్రజాపతి, మీరాదేవి కీలక పాత్రల్లో నటించిన ఈ డాక్యుమెంటరీ ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో వివిధ దేశాల నుంచి 138 చిత్రాలు పోటీపడగా వాటిలో నుంచి పదిహేను సినిమాల్ని షార్ట్‌లిస్ట్ చేశారు. అందులో ‘రైటింగ్ విత్ ఫైర్’ ఒకటిగా నిలిచింది. తదుపరి రౌండ్లో ఈ సినిమా ఎంపికైతే ఆస్కార్‌కు గట్టిపోటీదారుగా నిలిచే అవకాశముంది.
‘కూళంగల్’కు నిరాశ
ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరిలో మన దేశం నుంచి ఆస్కార్ పోటీలో నిలిచి అందరిలో ఆశలను రేకెత్తించిన తమిళ చిత్రం ‘కూళంగల్’కు నిరాశే మిగిలింది. టాప్-15 చిత్రాల జాబితాలో ఈ సినిమాకు చోటు దక్కలేదు. తమిళ అగ్ర కథానాయిక నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్‌శివన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పీఎస్ వినోద్‌రాజ్ దర్శకత్వం వహించారు.