India | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా రికార్డులకెక్కిన భారత్.. దయనీయ దేశాల జాబితాలోనూ చేరింది. దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న 157 దేశాల్లో ఇండియా 103వ ర్యాంక్ సాధించిం ది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ (115వ ర్యాం కు) సహా మొత్తం 54 దేశాలు ఈ సూచీలో భారత్ కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి. నిరుద్యోగం పెరగడమే భారత్లో ప్రస్తుత పరిస్థితికి కారణంగా నివేదిక అంచనా వేసింది. ఈ మేరకు ప్రఖ్యాత ఆర్థికవేత్త స్టీవ్ హాంకే ‘వార్షిక దుర్భర దేశాల జాబితా’ (హెచ్ఏఎంఐ) వెల్లడించింది. సూచీలో అత్యంత దుర్భర దేశంగా జింబాబ్వే తొలిస్థానంలో నిలిచింది. అత్యంత తీవ్రమైన ద్రవ్యోల్బణం, అతి నిరుద్యోగిత, అత్యధిక వడ్డీ రేట్లు, బలహీనమైన జీడీపీ వృద్ధి వెరసి జింబాబ్వేను ఈ స్థితికి తీసుకొచ్చినట్టు నివేదిక వెల్లడించింది. మరోవైపు హెచ్ఏఎంఐ స్కోరును అతితక్కువ పొందిన దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది. అంటే.. ఆ దేశం అభివృద్ధిలో ముందంజలో ఉండటంతో పాటు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అర్థం.
నిరుద్యోగ భారత్
ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు మాటతప్పింది. సీఎంఐఈ తాజా నివేదిక ప్రకారం.. మార్చిలో 7.8 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్ నాటికి 8.11 శాతానికి ఎగబాకింది. గత డిసెంబర్ తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగిత రేటు పెరగడం ఇదే తొలిసారి. గడిచిన నెలరోజుల వ్యవధిలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 8.51 శాతం నుంచి 9.81 శాతానికి పెరగ్గా, గ్రామాల్లో ఇదే సమయంలో 7.47 శాతం నుంచి 7.34 శాతానికి స్వల్పంగా తగ్గింది. మొత్తం శ్రామికవర్గంలో కేవలం 43 శాతం మందికే ఉద్యోగాలు ఉండగా, ఇప్పటికిప్పుడు అర్హతకు తగిన ఉద్యోగాలు కావాల్సిన వారు 22 కోట్ల మంది వరకు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ‘దేశంలో జనాభా పెరుగుతున్నట్టే పనిచేయగల వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. అయితే, దీనికి అనుగుణంగా ఉద్యోగ కల్పన జరగట్లేదు’ అని సీఎంఐఈ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహేశ్ వ్యాస్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
60 వేల మంది ఉద్యోగాలు గాయబ్
గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ రంగంలో 60 వేల మంది అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ వర్కర్స్ ఉద్యోగాలు పోగొట్టుకున్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. ఇదే సమయం లో ఉద్యోగాల కల్పన 7.7 శాతం తగ్గి నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఇండి యన్ స్టాఫింగ్ ఫెడరేషన్ తెలిపింది. దేశవ్యాప్తంగా 120 రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తుండటం తెలిసిందే.
మాసం నిరుద్యోగిత రేటు
నవంబర్, 2022 8 శాతం
డిసెంబర్, 2022 8.3 శాతం
జనవరి, 2023 7.45 శాతం
ఫిబ్రవరి, 2023 7.45 శాతం
మార్చి, 2023 7.8 శాతం
ఏప్రిల్, 2023 8.11 శాతం