న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: భూమధ్య రేఖకు సమీపంలోని పసిఫిక్ మహా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు తీవ్రంగా, వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం తప్పదని ప్రపంచ వాతావరణ విభాగం (డబ్ల్యూఎంవో) సూచించింది. ఈ ఏడాది మే నుంచి జూలై నెల మధ్యలో భారత్‌లో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని పేర్కొంది. దీంతో జూలై నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో కొంతకాలం తటస్థ వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఇప్పుడు మార్పు బలంగా కనిపిస్తున్నదని డబ్ల్యూఎంవో చీఫ్ విల్ఫ్రాన్ మౌఫూమా చెప్పారు. ఎల్‌నినో ఏర్పడటం అవశ్యమని, ఆ తరువాత అది మరింత తీవ్రతరమవుతుందని హెచ్చరించారు.
సాధారణ పరిస్థితుల్లో, వెచ్చని ఉపరితల సముద్ర జలాలను ఈదురు గాలులు ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా వైపు తోస్తుండగా, శీతల జలాలు దక్షిణ అమెరికా వద్ద పైకి లేస్తాయి. కానీ ఎల్‌నినో పరిస్థితుల్లో ఈదురు గాలులు బలహీనపడి, వెచ్చని సముద్ర జలాలు పసిఫిక్ అంతటా తూర్పువైపు విస్తరిస్తాయి. ఫలితంగా ప్రపంచ వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు కలుగుతాయి.
ఎల్‌నినో పరిస్థితులు ఎప్పుడు ఏర్పడినా ఆ ప్రభావం భారత్‌పై ఎక్కువగా ఉంటున్నది. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడం, వర్షపాతం పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. భారత్‌లో వేసవి అనంతర రుతు పవనాలు అధికంగా భూమి, సముద్రం మధ్య ఉండే ఉష్ణోగ్రతల మార్పులపై ఆధారపడి ఉంటాయి. ఎల్‌నినో సంవత్సరంలో మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుండి తేమ అధికమై రుతు పవనాలను బలహీనపరుస్తాయి. మరోవైపు ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచంలో మూడో వంతు జనాభా వేడి గాలులు, కరువు వంటి ప్రభావాలకు తీవ్రంగా లోనవనున్నదని జియోగ్రాఫికల్ రీసెర్చ్ లెటర్స్‌లో ప్రచురితమైన పరిశోధన పేర్కొంది. వడ గాలుల ప్రభావం ప్రస్తుతంతో పోలిస్తే ఐదింతలు ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని భారత వాతావరణ విభాగం శనివారం తెలిపింది. అందువల్ల మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచించింది. సూర్యుని వేడిని నేరుగా శరీరంపై పడకుండా చూడటం, ఎక్కువగా నీరు తాగడం, తేలికైన వస్ర్తాలు ధరించడం వంటి జాగ్రత్త చర్యలు చేపట్టాలని తెలిపింది.