ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 14 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శనివారం భోగిపండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే ఇండ్లముందు రంగురంగుల ముగ్గులు వేసి బొడ్డెమ్మలను పెట్టారు. భోగిపండుగ సందర్భంగా యువకులు పెద్ద ఎత్తున బోగిమంటలు కాల్చారు. యువకులు పెద్ద ఎత్తున పతంగులను ఎగురవేశారు. ఇబ్రహీంపట్నంలోని కిరాణాషాపులు, సామాను కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. గ్రామాలలో గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు కూడా సందడి చేశారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీల్ల్లో సంక్రాంతి పండుగ ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేశారు. పండుగ సందర్భంగా యువకులు గ్రామాల్లో క్రీడాపోటీలను నిర్వహించారు.
కడ్తాల్ : మండల వ్యాప్తంగా పండుగ సందడి నెలకొంది. ఆడపడుచులు, బంధువుల రాకతో గ్రామాల్లోని ఇండ్లన్నీ కళకళలాడుతున్నాయి. మైసిగండి గ్రామంలో తెల్లవారుజామున ప్రజలు భోగి మంటలను ఏర్పా టు చేశారు. ప్రజలు తమ ఇండ్లలోని పాత వస్తువులను, సామాగ్రిని భోగి మంటల్లో వేశారు. చిన్న పిల్లలకు మహిళలు భోగి పండ్లను పోశారు.
షాబాద్ : చేవెళ్ల నియోజకవర్గంలో భోగీ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. శనివారం నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోని ఆయా గ్రామాల్లో ప్రజలు భోగీ మంటలు వేశారు. అనంతరం మహిళలు వాకిళ్లలో కలాపిలు చల్లుకుని రంగురంగుల ముగ్గులు వేశారు. ఆయా గ్రామాల్లో యువకులు పతంగులు ఎగురవేశారు. గ్రామాల్లో ఎక్కడ చూసిన సంక్రాంతి పండుగ వేడుకల్లో ప్రజలు నిమిగ్నమయ్యారు.
సంస్కృతీసంప్రదాయాలను సంరక్షించుకోవాలి
కడ్తాల్ : మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, వాటిని సంరక్షించుకోవాలని జడ్పీటీసీ దశరథ్‌నాయక్ అన్నారు. శనివారం మండల పరిధిలోని అన్మాస్‌పల్లి గ్రామంలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ సంస్థ సభ్యుడు, బాల చైతన్య కేంద్రాల నిర్వాహకుడు రజనీకాంత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పర్యావరణ ముగ్గులు, పతంగుల పోటీలను నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, సీజీఆర్ సభ్యులు రజనీకాంత్, కోటేశ్, వంశీ, రామకృష్ణ పాల్గొన్నారు.