మన హీరోలతో సినిమాలు రూపొందించేందుకు తమిళ దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ హీరోల జాబితాలో నాగ చైతన్య కూడా చేరారు. ఆయనతో సినిమా రూపొందించే సన్నాహాల్లో ఉన్నట్లు దర్శకుడు వెంకట్ ప్రభు తెలిపారు. కోలీవుడ్‌లో ‘మాంగాత’, ‘మానాడు’ వంటి పలు సూపర్ హిట్ చిత్రాలను రూపొందించారీ దర్శకుడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెంకట్ ప్రభు మాట్లాడుతూ…‘నాగ చైతన్యతో ఓ సినిమా రూపొందించబోతున్నాను. ఇది రీమేక్ సినిమా కాదు. స్ట్రైట్ సినిమాగానే తెరకెక్కిస్తాం. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాగ చైతన్యకు తమిళం రావడం వల్ల నేను చెప్పిన కథలోని ఫీల్‌ను ఆయన బాగా అర్థం చేసుకున్నారు’ అని చెప్పారు. శింబు హీరోగా వెంకట్ ప్రభు రూపొందించిన ‘మానాడు’ సినిమా తెలుగులో నాగచైతన్యతో రీమేక్ చేస్తారని గతంలో వార్తలొచ్చాయి. ఈ కాంబినేషన్ నిజమే కానీ రీమేక్ కాదని దర్శకుడి మాటలతో స్పష్టమైంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించే అవకాశాలున్నాయి.