హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో చిన్నారుల అక్రమ దత్తత, రవాణా జోరందుకున్నట్టు కనిపిస్తున్నదని హైకోర్టు పేర్కొన్నది. ఓ దత్తత వ్యవహారానికి సంబంధించి మహిళా శిశు సంక్షేమశాఖ, హోంశాఖ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సమర్పించిన నివేదికలను పరిశీలించి ఈ వ్యాఖ్యలు చేసింది. దత్తత పేరుతో దూరమైన చిన్నారులతోపాటు వారిని కన్న తల్లిదండ్రుల ఆచూకీ కూడా కనిపించడంలేదని ఆందోళన వ్యక్తం చేసింది. విసృ్తత ప్రజాప్రయోజనాలతో కూడిన ఈ అంశాన్ని సుమోటో పిల్‌గా పరిగణిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్లో హోం, మహిళా-శిశు సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులు, మహిళా-శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ, డీజీపీలను ప్రతివాదులుగా చేర్చింది. సీనియర్ న్యాయవాది బీ మయూర్‌రెడ్డిని అమికస్ క్యూరీగా నియమించింది.
వివరాల్లోకి వెళ్తే.. 2023లో తాము దత్తత తీసుకున్న ఓ చిన్నారిని పోలీసులు స్వాధీనం చేసుకుని స్త్రీశిశు సంక్షేమ శాఖకు అప్పగించడాన్ని సవాలు చేస్తూ నల్లగొండ జిల్లా సూరారం మండలానికి చెందిన ఎం వెంకన్న దంపతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి కొట్టివేశారు. దీనిపై వెంకన్న దంపతులు దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. దీంతో అక్రమ దత్తత, మానవ అక్రమ రవాణా వ్యవహారాల్లో 61 మంది చిన్నారులు బాధితులుగా ఉన్నారని, ఇందుకు సంబంధించి 31 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని 176 మందిని నిందితులుగా చేర్చి దర్యాప్తు చేస్తున్నామని రాష్ట్ర హోంశాఖ నివేదించింది. 27 కేసుల్లో బాధిత చిన్నారుల తల్లిదండ్రులను గుర్తించగలిగామని, మరో 26 కేసుల వివరాలను బాలల సంక్షేమ కమిటీకి అప్పగించామని తెలిపింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా సుమోటోగా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలిపింది. దీనిపై విచారణను అక్టోబర్ 5కు, వెంకన్న అప్పీలుపై విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)లో ‘బ్రహ్మోస్’ విభాగం డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జైతీర్థ్ ఆర్ జోషి నియామకాన్ని హైకోర్టు సమర్థించింది. ఆయన నియామకం చెల్లదంటూ నిరుడు డిసెంబర్ 29న కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన తీర్పును జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ నందికొండ నర్సింగరావు ధర్మాసనం రద్దు చేసింది. ‘బ్రహ్మోస్’ డీజీగా ఎవరిని నియమించాలన్నది రక్షణ శాఖ విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుందని, నోటిఫికేషన్లో పేరొన్న నిబంధనల ప్రకారమే జైతీర్థ్ నియామకం జరిగిందని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ బీ నరసింహశర్మ చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. ఈ వ్యవహారంలో జైతీర్థ్తోపాటు కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతిస్తున్నట్టు ప్రకటించింది.