బాలీవుడ్ అగ్రహీరో ఆమిర్‌ఖాన్‌ను మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్‌గా అభివర్ణిస్తారు. ఏ పాత్రలోనైనా పరిపూర్ణత కనబరుస్తారాయన. మూడు దశాబ్దాలకుపైగా సాగుతున్న కెరీర్లో ఎన్నో చిరస్మరణీయమైన విజయాల్ని సొంతం చేసుకున్న ఆమిర్‌ఖాన్..కొన్నేళ్ల క్రితమే సినిమాల నుంచి తప్పుకోవాలని అనుకున్నాడట. తన తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’ ప్రమోషన్ కార్యక్రమాల సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘సినిమా నాకు కావాల్సినవన్నీ ఇచ్చింది. కీర్తిప్రతిష్టల్ని సంపాదించిపెట్టింది. అయితే బిజీషెడ్యూల్స్ వల్ల కుటుంబానికి సరైన సమయం కేటాయించలేకపోతున్నాననే బాధ వెంటాడేది. ముఖ్యంగా పిల్లలకు దూరంగా ఉండటం చాలా కష్టంగా అనిపించేది. ఒకానొక సమయంలో ‘సినిమాలే ప్రపంచం కాదు కదా..ఫ్యామిలీకి మించిన సంతోషం ఏముంటుంది..సినిమాలకు గుడ్‌బై చెబుతాం’ అని అనుకున్నా. నటనతో పాటు సినీ నిర్మాణం నుంచి కూడా తప్పుకోవాలనుకున్నా. ‘లాల్‌సింగ్ చద్దా’ షూటింగ్ పూర్తికాగానే రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిద్దామనుకున్నా’ అని ఆమిర్‌ఖాన్ పేర్కొన్నారు. అయితే తన నిర్ణయాన్ని భార్యాపిల్లలు వ్యతిరేకించారని…భార్య కిరణ్‌రావు భావోద్వేగానికి గురై ఏడ్చేసిందని ఆమిర్‌ఖాన్ వెల్లడించారు. వృత్తికి, కుటుంబానికి బ్యాలెన్స్ చేయడం సాధ్యమేనని ఫ్యామిలీ మెంబర్స్ సూచించడంతో రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నానని ఈ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ చెప్పుకొచ్చాడు. ఆమిర్‌ఖాన్ కథానాయకుడిగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన ‘లాల్‌సింగ్ చద్దా’ ఆగస్ట్‌లో ప్రేక్షకులముందుకు రానుంది.