ఇప్పటికే అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్యం వహించిన ముగ్గురు అధికారులపై వేటు అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 30 లోగా హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపాలిటీల్లో అనుమతులు లేని భవనాలను గుర్తించి కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నిర్మాణంలో ఉన్న అక్రమ భవనాలను గుర్తించే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. మున్సిపాలిటీల్లో 2 వేల వరకు అనుమతులు లేని నిర్మాణాలుండగా.. అత్యధికంగా మణికొండ, ఆదిబట్ల, బండ్లగూడలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఐదారు నెలల నుంచే అక్రమ నిర్మాణాలపై నజర్ పెట్టిన జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ పదిహేను రోజులకోసారి తనిఖీలు చేస్తున్నది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోకుండా నిర్లక్ష్యం వహించే సంబంధిత అధికారులపై వేటు వేయడంతోపాటు అక్రమదారులకు జరిమానా విధిస్తూ వస్తున్నది. అవసరమైతే కూల్చివేతలకు ఆదేశిస్తున్నది. ఇప్పటికే ముగ్గురు అధికారులపై వేటు వేసిన విషయం తెలిసిందే.
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 11 : హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నెల 30 వరకు సంబంధిత మున్సిపాలిటీల్లోని అక్రమ నిర్మాణాలను గుర్తించడంతోపాటు కూల్చివేతపై సమగ్ర నివేదికివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించినట్లయితే సంబంధిత అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని సంబంధిత ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలతో మున్సిపాలిటీలవారీగా అక్రమ నిర్మాణాల వివరాలను జిల్లా యంత్రాంగం సేకరిస్తున్నది. సంబంధిత మున్సిపాలిటీల్లో దాదాపు 2 వేల వరకు అక్రమ నిర్మాణాలున్నట్లు అధికారులు గుర్తించారు. అత్యధికంగా మణికొండ, ఆదిబట్ల, బండ్లగూడ మున్సిపాలిటీల్లో ఉన్నట్లు తేల్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా అదనపు (స్థానిక సంస్థల) కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం ప్రతి పదిహేను రోజులకోసారి జిల్లాలోని మున్సిపాలిటీల్లో తనిఖీలు చేసి అక్రమ నిర్మాణాలపై దృష్టి సారిస్తున్నారు. టీఎస్-బీపాస్ అమల్లోకి తీసుకువచ్చిన దృష్ట్యా అక్రమ నిర్మాణాలను వెంటనే గుర్తిస్తున్నారు. టీఎస్-బీపాస్ ద్వారా అనుమతి పొందారా లేదనే వివరాలతోపాటు ఎన్ని అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు పొందారనే వివరాలను తెలుసుకుంటున్నారు. అనుమతి లేకున్నా నిర్మాణం చేపడుతున్నట్లయితే స్థానికంగా నిర్లక్ష్యం వహించే ఆయా మున్సిపాలిటీ అధికారులపై వేటు వేయడంతోపాటు అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఫైన్ వేయడం, ఫైన్ చెల్లించనివారి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆదేశాలిస్తూ వస్తున్నది.
అక్రమ నిర్మాణాల వివరాల సేకరణ
హెచ్ఎండీఏ పరిధిలో జిల్లాలోని ఆదిబట్ల మున్సిపాలిటీతోపాటు జల్పల్లి, ఇబ్రహీంపట్నం, మణికొండ, నార్సింగి, పెద్ద అంబర్పేట్, షాద్‌నగర్, శంషాబాద్, శంకర్పల్లి, తుక్కుగూడ, తుర్కయాంజాల్, కొత్తూరు, బండ్లగూడ జాగీర్, మీర్పేట్, బడంగ్పేట్ కార్పొరేషన్లు ఉన్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపాలిటీల్లో 2 వేల వరకు అక్రమ నిర్మాణాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు, మరోసారి తనిఖీలు చేపట్టేందుకు నిర్ణయించారు. ఇప్పటికే ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ బృందం మరోసారి మరో వారం, పది రోజుల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించడంతోపాటు కూల్చివేసేందుకు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఎక్కువగా ఒక అంతస్తు భవన నిర్మాణానికి అనుమతులు పొంది, అదనంగా రెండు, మూడు అంతస్తుల మేర భవన నిర్మాణాలను అక్రమంగా నిర్మించినవే అధికంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు కూల్చివేస్తారా లేదంటే జరిమానా విధిస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు ఇటీవల జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం పలు మున్సిపాలిటీల్లో గుర్తించిన అక్రమ నిర్మాణాలకు సంబంధించి.. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 253, 254లోని ప్లాట్ నం.18లో కేవలం మూడు అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు పొంది, నాలుగు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టడం, మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని సర్వేనం.116లోని నెక్నాంపూర్ గ్రామ పరిధిలోని ప్లాట్ నం.105లో ప్రభుత్వ దేవాదాయ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండానే సెల్లార్తోపాటు 2 అంతస్తుల భవన నిర్మాణాన్ని చేపట్టడం, పుప్పాలగూడ గ్రామ పరిధిలోని సర్వే నం.90, 94లోని ప్లాట్ నం.23పీలో 2 అంతస్తుల నిర్మాణానికి అనుమతిపొంది 3 అంతస్తుల నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లోనూ అనుమతులు పొందిన దానికంటే ఎక్కువ అంతస్తుల నిర్మాణం చేపట్టినట్లు గుర్తించిన జిల్లా టాస్క్‌ఫోర్స్ అడ్డుకోవడంలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులపై చర్యలు కూడా తీసుకుంది.
అక్రమ నిర్మాణాల వివరాలను సేకరిస్తున్నాం : ప్రతీక్‌జైన్, జిల్లా అదనపు కలెక్టర్
హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాల వివరాలను మున్సిపాలిటీలవారీగా సేకరిస్తున్నాం. అన్ని మున్సిపాలిటీల్లోనూ మరోసారి తనిఖీలు చేపట్టి, అక్రమ నిర్మాణాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాం. అక్రమంగా నిర్మించిన ఏ నిర్మాణాన్నీ వదిలే ప్రసక్తే లేదు.