Allu Arjun | తన వ్యక్తిత్వ హక్కులను (Personality Rights) కాపాడుకునేందుకు ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఫోటోలు, గొంతు మరియు వ్యక్తిగత లక్షణాలను తన అనుమతి లేకుండా వాణిజ్యపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అల్లు అర్జున్ దాఖలు చేసిన ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ విచారణ సందర్భంగా.. అల్లు అర్జున్ తరఫున సీనియర్ అడ్వకేట్ స్వాతి సుకుమార్ వాదనలు వినిపిస్తూ, కొందరు వ్యక్తులు నటుడి చిత్రాలను ఉపయోగించి వస్తువులను విక్రయించడమే కాకుండా, అభ్యంతరకరమైన పోర్నోగ్రాఫిక్ కంటెంట్లో కూడా ఆయన పోలికలను వాడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ‘ఫేక్ కాల్ పుష్ప’ అనే మొబైల్ యాప్ ద్వారా అల్లు అర్జున్ ఏఐ (AI) రూపంతో వీడియో కాల్ మాట్లాడవచ్చని ప్రచారం చేస్తున్నారని, దీనివల్ల సామాన్య ప్రజలు మోసపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది నటుడి ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు ప్రజలను తప్పుదోవ పట్టించే చర్య అని ఆమె వాదించారు. కాగా, ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న ఫ్రాంక్లీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, తమ సంస్థ కేవలం ఒక మధ్యవర్తి మాత్రమేనని, ఫిర్యాదు అందిన వెంటనే సదరు లింకులను తొలగించామని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఈ వ్యవహారానికి సంబంధించి మూడు రోజుల్లోగా పూర్తిస్థాయి కంప్లయన్స్ రిపోర్టును సమర్పించాలని సదరు సంస్థను ఆదేశించింది. దీనివల్ల సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల రక్షణలో ఈ తీర్పు కీలకంగా మారనుంది.