Euphoria | ప్రముఖ సీనియర్ దర్శకుడు గుణశేఖర్ తన కెరీర్, వ్యక్తిగత అనుభవాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందిన సరికొత్త చిత్రం ‘యుఫోరియా’. ఈ చిత్రం ఫిబ్రవరి 6వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గోన్న ఆయన ఆసక్తికర మళ్లీ జన్మంటూ ఉంటే దర్శకుడిగా పుట్టను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దర్శకత్వం వహించడం వల్ల ఎదురయ్యే విపరీతమైన ఒత్తిడిని దృష్టిలో పెట్టుకునే తాను ఆ మాట అన్నానని . చాలామంది భావిస్తున్నట్లు దీనికి సోషల్ మీడియా ట్రోలింగ్ కారణం కాదని గుణశేఖర్ స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక దర్శకుడు భరించే మానసిక భారం మాత్రమేనని ఆయన తెలిపారు. ఏ వృత్తిలోనైనా పని పూర్తయ్యాక ఒక రకమైన సంతృప్తి లభిస్తుందని, కానీ దర్శకుడికి సినిమా విడుదలయ్యే వరకు ఆ ప్రశాంతత దొరకదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 1992లో తన సినీ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు కంటినిండా నిద్రకు దూరమయ్యానని, కనీసం వచ్చే జన్మలోనైనా హాయిగా నిద్రపోవాలన్న ఆశతోనే దర్శకుడిగా పుట్టనని అన్నానని ఆయన నవ్వుతూ వివరణ ఇచ్చారు. ఈ వృత్తిలో తృప్తి అనేది దొరకడం చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.
గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మించిన ఈ ‘యుఫోరియా’ చిత్రంలో భూమిక, సారా అర్జున్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుత యువత ఆలోచనలకు దగ్గరగా ఉండే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ ప్రెస్ మీట్లో నటి భూమికతో పాటు నిర్మాత నీలిమ గుణ కూడా పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు. ఫిబ్రవరి 6న విడుదల కానున్న ఈ సినిమాతో గుణశేఖర్ మళ్లీ తన మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.