న్యూఢిల్లీ: ఇండియాలో తయారైన కోవిడ్ టీకాను తాను తీసుకున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో కలిసి మీడియాతో ఆయన ఇవాళ మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాల గురించి ఆయన వెల్లడించారు. భూమి, సముద్రం, ఆకాశంతో పాటు సైబర్ ప్రమాదాలను కలిసి కట్టుగా ఎదుర్కొంటున్నామని బోరిస్ అన్నారు. ఫైటర్ జెట్ టెక్నాలజీ, మారిటైం టెక్నాలజీలోనూ ఇండియా, బ్రిటన్ కలిసి పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా, సీరం సంస్థలు తయారు చేసిన కోవిడ్ టీకాలు బిలియన్ల మందిని కాపాడినట్లు బోరిస్ చెప్పారు. నేను కూడా టీకా తీసుకున్నానని, తన చేతికి ఇండియన్ టీకా తీసుకున్నట్లు బోరిస్ తెలిపారు. ఆ టీకా తనకు ఎంతో మంచి చేసిందని, ఇండియాకు థ్యాంక్స్ చెబుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచానికి భారత్ ఫార్మసీ కేంద్రంగా మారిందన్నారు.