నటించే ఏ క్యారెక్టర్లోనైనా ప్రేక్షకులను మెప్పించగలను అనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్. ‘బాజీరావ్ మస్తానీ’,‘పద్మావత్’, ‘సింబా’,‘గల్లీ బాయ్’ వంటి చిత్రాలతో స్టార్‌గా ఎదిగారు రన్వీర్. త్వరలో ఆయన ‘జయేష్‌భాయ్ జోర్దార్’ చిత్రంతో తెరపైకి రాబోతున్నారు. యష్‌రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో షాలినీ పాండే నాయికగా నటిస్తున్నది. ఇటీవల రన్వీర్ సింగ్ మాట్లాడుతూ…‘టైప్ కాస్టింగ్ కాకపోవడం నటుడిగా నేను సాధించుకున్న ఘనత అనుకుంటాను. ఏ సినిమా నా గత చిత్రంతో పోల్చినట్లు ఉండకుండా జాగ్రత్త పడుతుంటాను. అందుకే నా కెరీర్లో ఒకే రకమైన సినిమాల్లో, పాత్రల్లో నటించలేదు. ‘బ్యాండ్ బాజా బారాత్’ సినిమా చూసి నేను ఢిల్లీ కుర్రాడినని అనుకున్నారు. నటనతో ప్రేక్షకులను అలా ఒప్పించగలను. ‘జయేష్‌భాయ్ జోర్దార్’ కూడా ఏ రిఫరెన్స్ లేకుండా నటించిన సినిమా. ఇలాంటి భిన్నమైన సినిమాలతోనే నా ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. జయేష్‌భాయ్ జోర్దార్ మే 13న విడుదలకు సిద్ధమవుతున్నది.