సంగారెడ్డి, మార్చి 24 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలోని ఐఐటీ హైదరాబాద్‌లో గురువారం మెడికల్ సింపోజియం ప్రారంభమైంది. ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి మెడికల్ సింపోజియంను ప్రారంభించారు. ఇందులో ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్(సీఎఫ్హెచ్ఈ)తో పాటు వేర్వేరు సంస్థలు అభివృద్ధి చేసిన నూతన వైద్య పరికరాలను ప్రదర్శించారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వైద్యులతో పాటు వైద్య పరికరాల తయారీ పరిశ్రమల ప్రతినిధులు మెడికల్ సింపోజియ్లో పాల్గొన్నారు.
జీవన్‌లైట్ వెంటిలేటర్
కరోనాతో వెంటిలేటర్ల ఆవసరాన్ని గుర్తించిన ఐఐటీ హైదరాబాద్, ఎరోబయాసిస్ సంస్థతో కలిసి జీవన్‌లైట్ ఐసీయూ వెంటిలేటర్‌ను అభివృద్ధి చేసింది. జీవన్‌లైట్ వెంటిలేటర్ రూ.5 నుంచి రూ.6 లక్షల వరకు అందుబాటులో ఉంటుందని ఏరోబయాసిస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. జీవన్‌లైట్ వెంటిలేటర్ రోగులకు ఎంతో ఉపయోకరంగా ఉండడంతో పాటు వైద్యులు తమ ఫోన్ ద్వారా వెంటిలేటర్ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. జీవనలైట్ వెంటిలేటర్ రోగులకు సంబంధించిన ఆరోగ్యపరమైన వివరాలను డాటాను నిక్షిప్తం చేస్తుంది.
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి టీ-వర్క్స్ సంస్థ పని చేస్తున్నది. హైదరాబాద్‌లో స్టార్టప్ కంపెనీలతో కలిసి టీ-వర్క్స్ కొవిడ్ సమయంలో రోగులకు అవసరమైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను అభివృద్ధి చేసింది. అతి తక్కువ ఖర్చుతో ఆక్సిన్ కాన్సన్ట్రేటర్ తయారుచేసి ప్రస్తుతం లైసెన్స్ కోసం ఎదురుచూస్తున్నది. టీ-వర్క్స్ సంస్థ కరోనా రోగుల కోసం రూపొందించిన బిడ్జ్రి వెంటిలేటర్ ఐఐటీ హైదరాబాద్ సింపోజియమ్‌లో పరిశోధకులను ఆకట్టుకుంది.
చిన్నారులకు వరం ఎన్-లైట్ పరికరం
ఐఐటీ మెడికల్ సింపోజియమ్‌లో ఎన్-లైట్ వైద్య పరికరం అందరినీ ఆకట్టుకుంది. నవజాత శిశువులకు పచ్చకామెర్లు వచ్చిన సమయంలో వారికి చికిత్స అందజేసేందుకు ఫొటోథెరపీ అందజేసేందుకు ఇంక్యుబేటర్‌లో ఉంచుతారు. ఈ చికిత్సతో తలుల్లు తమ పిల్లలకు పాలు ఇచ్చేందుకు ఇబ్బంది పడడంతో పాటు నవజాత శిశువులు ఇబ్బందులు ఎదుర్కోవడం చూస్తున్నాం. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు ప్రసాద్, కె.అఖిత ఎన్-లైట్ అనే పరికరం కనుగొన్నారు. ఎన్-లైట్ పరికరం చిన్నారుల దుస్తుల్లో ఉంచితే వారికి అవసరమైన ఫొటోథెరపీ అందుబాటులోకి వచ్చి పచ్చకామెర్లు తగ్గిపోతాయని పరిశోధకురాలు అఖిత తెలిపారు. ఎన్లైట్ ద్వారా నవజాతశిశువు, తల్లికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.
రోబోటిక్ ఆర్మ్
ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు అనిఖేత్, విఘ్నేష్, మేఘ, వివేక్ అభివృద్ధి చేసిన రోబోటిక్ హ్యాండ్ ఐఐటీ మెడికల్ సింపోజియమ్‌లో అందరి దృష్టి ఆకర్షించింది. వీరు అభివృద్ధ్ధి చేసిన రోబోటిక్ ఆర్మ్ క్యాన్సర్ కణతులను గుర్తించి తొలిగించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. నూతన టెక్నాలజీ ద్వారా రూపొందించిన రోబోటిక్ ఆర్మ్ క్యాన్సర్ రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని పరిశోధకులు విఘ్నేష్, వివేక్ తెలిపారు.
ఆర్మ్-ఏబుల్
ఐఐటీ హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌తో కలిసి ఐఐటీ విద్యార్థులు అభివృద్ధి చేసిన ఆర్మ్ -ఏబుల్ పరికరం ఫిజియోథెరిపీ అవసరమయ్యే రోగులకు లాభాన్ని చేకూరుస్తుంది.ఆర్మ్ ఏబుల్ ద్వారా ఫిజియోథెరపీ రోగులు కం ప్యూటర్‌లో గేమ్స్ ఆడుతూ తమకు సూచించిన ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు చేయవచ్చు. దీంతో రోగులకు ఆటవిడుపుగా ఉంటుందని పరిశోధకుడు హబీబ్ అలీ తెలిపారు.
జీవన్ లైట్ వెంటిలేటర్ ఆవిష్కరణ
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ను గవర్నర్ తమిళిసై గురువారం తొలిసారిగా సందర్శించారు. ఐఐటీ హైదరాబాద్, ఏరోబయోసిస్ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన జీవన్‌లైట్ స్మార్ట్ మెడికల్ ఐసీయూ వెంటిలేటర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఏరోబయోసిస్ సీఈవో రాజేశ్ , ఏరోబయాసిస్ కంపెనీ ప్రతినిధి సిరిల్ ‘జీవన్‌లైట్ ఐసీయూ వెంటిలేటర్’ తయారీ, పనితీరు గురించి గవర్నర్‌కు వివరించారు. కొత్తగా తయారు చేసిన జీవనల్ లైట్ వెంటిలేటర్లు పదింటిని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు అందజేశారు. వీటిని గవర్నర్ దవాఖానలకు అందజేయనున్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హన్మంతరావు, ఎస్పీ రమణకుమార్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.