సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ)/బన్సీలాల్‌పేట్ : బోయిగూడ అగ్నిప్రమాదానికి కారణాలను గుర్తించేందుకు గురువారం హైదరాబాద్ క్లూస్ టీమ్ ఘటనా స్థలిలో ‘త్రీ’డీ స్కానర్‌తో స్కానింగ్ నిర్వహించింది. ఈ ప్రమాదానికి ట్రాలీ ఆటో కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బోయిగూడలోని శ్రావణ్ ట్రేడర్స్ స్క్రాప్ గోడౌన్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది బిహార్ వలస కార్మికులు సజీవ దహనమైన ఘటన తెలిసిందే. ప్రమాద కారణాలపై పోలీసులు శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషణ చేస్తున్నారు. భిన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. క్లూస్ టీమ్ ఘటనాస్థలిలో నమూనాలను సేకరించింది. అగ్గి పుట్టడానికి ఆటోనే కారణమై ఉండవచ్చనే ఆధారాలు కూడా లభించాయి.
సీసీ పుటేజీల్లో…
గాంధీనగర్ ఇన్స్పెక్టర్ మోహన్‌రావు నేతృత్వంలోని బృందం గోడౌన్ పరిసరాల్లో సీసీ కెమెరాలను పరిశీలించింది. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. 3.40కి గోడౌన్ ప్రధాన ద్వారం ప్రాంతంలో ఒక పేలుడు సంభవించింది. 3.50కి కార్మికుడు ప్రేమ్ కిటికీలో నుంచి సజ్జపైకి.. అక్కడ నుంచి కిందకు దూకాడు. ఈ దృశ్యాలన్నీ ఫుటేజీలో నమోదయ్యాయి.
మృతదేహాల అప్పగింత
కార్మికుల మృతదేహాలను రెండు విమానాల్లో పాట్నాకు పంపించారు. సైబర్‌క్రైమ్స్ ఇన్స్పెక్టర్ సతీశ్, ముషీరాబాద్ డిప్యూటీ తహసీల్దార్ హేమంత్‌కుమార్ బృందం అక్కడి అధికారుల సమక్షంలో మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.
దీనంగా పెంపుడు కుక్క..
అగ్నిప్రమాదం జరిగిన చోట ఓ పెంపుడు కుక్క దీనంగా కనిపించడం చూపరులను ఆవేదనకు గురిచేసింది. గురువారం ఆధారాలు సేకరించేందుకు వచ్చిన క్లూస్ టీమ్ పోలీసులు కాలికి గాయంతో ఉన్న ఆ కుక్కను చూసి జాలిపడ్డారు. ఆహారం తినిపించారు. గోడౌన్ యజమాని, అందులో పనిచేసే కార్మికులు ఆ పెంపుడు కుక్కకు ప్రతిరోజు ఆహారం పెట్టి.. ఆప్యాయంగా చూసుకునే వారని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ పెంపుడు కుక్క బయటకు పరుగెత్తుకుంటూ రావడం సీసీ కెమెరాలో కనిపించింది.
నమూనాల సేకరణ
స్క్రాప్ గోడౌన్లో గేట్ వద్ద ట్రాలీ ఆటోను పార్కు చేశారు. మంగళవారం రాత్రి కూడా అందులో పేపర్లు తెచ్చారు. అది పార్కు చేసిన చోటే పేలుడు జరిగినట్లు శబ్ధం వినిపించింది. ఆటో నుంచి ఆయిల్ లీక్ అయినట్లు ఆనవాళ్లు లభించాయి. ఆటో పూర్తిగా కాలిపోగా, ఆయిల్ లీక్ అయి మంటలు వచ్చాయా? మంటలు అంటుకున్న తరువాత ఆటోకు వ్యాపించి పేలుడు సంభవించిందా? అనే విషయాలపై విశ్లేషిస్తున్నారు. స్క్రాప్గోడౌన్ ప్రాంగణంలో 10 చోట్ల నమూనాలను సేకరించారు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంటి వాటితో ప్రమాదం జరిగిందా అనే విషయాన్ని గుర్తించేందుకు ఫ్యూయల్ టెస్టింగ్ యంత్రంతో తనిఖీ చేసి..ఆరు చోట్ల నుంచి శాంపిళ్లు సేకరించారు. కార్మికులు ఉపయోగించిన వంట గదిలో ఉన్న సిలిండర్, స్టౌవ్‌ను స్వాధీనం చేసుకున్నారు.అయితే రెగ్యులేటర్ దొరకలేదు. గోడౌన్లో కేబుల్స్ స్టోర్ చేసి పెట్టారు. విద్యుత్ లైన్లు, ప్రధాన బోర్డు వద్ద పరిస్థితి ఎలా ఉందనే విషయాలను ఆరా తీశారు.