మేడ్చల్, మార్చి6(నమస్తే తెలంగాణ): మహిళల అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ మహిళా బంధు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఘట్కేసర్, పోచారం, కీసర, దమ్మాయిగూడ, జవహర్‌నగర్‌లో జరిగిన కేసీఆర్ మహిళా బంధు వేడుకల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి దేశంలో చరిత్ర సృష్టించినట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకాలతో మహిళలందరూ భరోసాతో ఉన్నారని అన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగి స్వయం ప్రతిపత్తి సాధించాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ము బారక్, కేసీఆర్ కిట్, వివిధ రకాల పింఛన్లు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ను మహిళందరూ ఇంటి సభ్యునిగా భావిస్తున్నారని అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. ప్రజలందరికి సీఎం కేసీఆర్‌పై పూర్తి నమ్మకం ఏర్పడిందన్నారు.
జిల్లా వ్యాప్తంగా.. మహిళా బంధు వేడుకలు
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా మహిళ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మెదటి రోజు ఆదివారం కేసీఆర్ మహిళా బంధు వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి మహిళలు రాఖీలు కట్టారు. పారిశుధ్య కార్మికులు, ఆశ వర్కర్ల, స్వయం సహాయక సంఘాల మహిళా ప్రతినిధులకు గౌరవ పూర్వకంగా సన్మాన కార్యక్రమాలను నిర్వహించారు. మహిళల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు థ్యాంక్యూ చేబుతూ విన్నూత కార్యక్రమాలను నిర్వహించారు.
మంత్రి మల్లారెడ్డి ఘట్కేసర్, పోచారం, కీసర, దమ్మాయిగూడ, జవహర్‌నగర్‌లో పాల్గొని పారిశుధ్య కార్మికుల, ఆశావర్కర్ల, స్వయం సంఘాల ప్రతినిధులకు చీరలను మంత్రి పంపిణీ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని శంభీపూర్లో టీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు కేసీఆర్ మహిళా బంధు వేడుకల్లో పాల్గొన్నారు. కేసీఆర్ మహిళా బంధు వేడుకలకు స్వచ్ఛందంగా మహిళలు తరలివచ్చి వేలాది సంఖ్యలో పాల్గొన్నారు.