నేనో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. కంపెనీకి సంబంధించిన సమాచారం ఫోన్లోనే భద్రపర్చుకున్నా. ఓ రోజు ఫోన్ పోయింది. కాళ్లు చేతులు ఆడలేదు. వెంటనే హాక్ ఐలో ఫిర్యాదు చేశా. పోయిన ఫోన్ దొరకదనుకున్నా. కానీ పోలీసులు నాకు ఫోన్ చేసి మీ మొబైల్ దొరికిందని చెప్పగానే ఆనందానికి అవధుల్లేవు. పోలీసులు అద్భుతంగా పని చేసి నా ఫోన్‌ను పట్టుకొచ్చారు. హైదరాబాద్ సీపీ ఆనంద్ నుంచి ఆ ఫోన్‌ను తీసుకున్నా.
– ఐటీ ఉద్యోగి అక్షయ్ కుమార్
సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): పోయిన సెల్ఫోన్లను ఐఎంఈఐ సా యంతో సిటీ పోలీసులు పట్టేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని ఐటీ సెల్ ఆధ్వర్యంలో ట్రేసింగ్ చేస్తున్నారు. ప్రతి నెల సుమా రు 100 వరకు ఫోన్లు పోయాయంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. ఇందులో కొందరు హాక్ ఐ నుంచి మరికొందరు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో పోలీసులు ఐఎంఈఐ నెంబర్ల ఆధారంగా వాటిని కనుగొంటున్నారు.
ఫోన్లు ఇలా పోతున్నాయి..
అజాగ్రత్త, నిర్లక్ష్యంతో అనేక మంది తమ ఫోన్లను పోగొట్టుకుంటున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారు.. బయట చార్జింగ్ పెట్టి మర్చిపోవడం.. ప్రయాణాలు చేసేటప్పుడు ఫోన్లు ఎక్కువగా పోతున్నాయి. పోయిన ఫోన్లు దొరకగానే కొందరు వాడుకుంటుండగా మరికొందరు స్నేహితులు, చుట్టాలకు ఇస్తున్నారు. ఇంకొందరు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
హాక్ ఐలో ఫిర్యాదు..
సాధారణంగా ఫోన్ పోగానే బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే పోలీసులు హాక్ ఐలో ఫిర్యాదు చేయమని సూచిస్తున్నారు. మొదటగా అప్లికేషన్లోకి వెళ్లగానే ‘లాస్డ్ రిపోర్టు’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి పోయిన సెల్‌ఫోన్‌కు సంబంధించిన వివరాలు నమోదు చేయాలి. వీటన్నింటిని పరిశీలిస్తున్న పోలీసులు ఈఎంఐఈ నంబర్‌ను ట్రేస్ చేసేందుకు తమ వద్ద ఉన్న టెక్నాలజీని వాడుతున్నారు. పోయిన ఫోన్‌ను ఎవరైనా వాడుతున్నా.. లేదా అందులో కొత్త సిమ్ వేసినా వెంటనే అలర్ట్ వస్తుంది. ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు ఇవ్వడంతో వారు ఆ ఫోన్లను స్వాధీనం చేసుకుంటున్నారు.
17 లక్షల యూజర్లు..
మొదటగా హైదరాబాద్‌లో హాక్ ఐ సేవలను ప్రారంభించి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. ప్రజలు, పోలీసులకు మధ్య వారధిగా నిలిచేలా ఈ అప్లికేషన్‌ను తీర్చిదిద్దారు. ప్రస్తుతం హాక్ ఐను వాడుతున్న వారు 42 లక్షల మంది ఉండగా.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 17.03 లక్షల మంది ఉన్నారు. కేవలం ఫిర్యాదుల కోసమే కాక హాక్ ఐలో మహిళల భద్రత, సురక్షిత ప్రయాణం కోసం ఎస్ఓఎస్ లాంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
నా భర్త బహుమతిగా ఇచ్చాడు..
నా భర్త బహుమతిగా ఇచ్చిన ఆ ఫోన్ అంటే నాకు ఎంతో ఇష్టం. చిన్న నిర్లక్ష్యంతో పోగొట్టుకున్నా. వెంటనే హాక్ ఐలో ఫిర్యాదు చేశా. పోలీసులు ట్రేస్ చేసి తిరిగి నాకు ఇచ్చారు. ఫోన్ దొరకడంతో ఎంతో సంతోషమేసింది. థ్యాంక్స్ టూ తెలంగాణ పోలీస్.
– నవనీత, గృహిణి
పోలీసులు ఫోన్ చేశారు..
నేనో చిన్న వ్యాపారిని. నా వ్యాపారికి సంబంధించిన అన్ని నంబర్లు ఫోన్లోనే ఉన్నాయి. ఓ రోజు నమాజ్ చేస్తుండగా ఫోన్ పోయింది. ఎంతో బాధ పడ్డా. వెంటనే బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశా. కొన్ని రోజుల తర్వాత ఫోన్ దొరికిందంటూ పోలీసులు ఫోన్ చేశారు. పోయిన ఫోన్‌ను కమిషనర్ నుంచి తీసుకున్నా. రాష్ట్ర పోలీసుల పనితీరు అద్భుతం.
– సయ్యద్ ముస్తాక్ అలీ, చిరువ్యాపారి
హాక్ ఐ బాగుంది..
నేను జయశంకర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను. ఓ రోజు విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఫోన్ పోయింది. ఇంటికి వెళ్లిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించి వెంటనే హాక్ ఐలో ఫిర్యాదు చేశా. నా ఫోన్‌ను వెంటనే పోలీసులు ట్రేస్ చేశారు. హాక్ ఐ అప్లికేషన్ ఎంతో బాగుంది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండా ఇంటి నుంచి ఫిర్యాదు చేసే అవకాశం ఇందులో ఉండటం విశేషం.
– ప్రసాద్‌రావు, ఉద్యోగి